Shashi Tharoor | అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య ఒత్తిడికి భారత ప్రభుత్వం తలొగ్గకూడదని కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ అన్నారు. ట్రంప్ ఇటీవల అమెరికా దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించడంతో పాటు అదనంగా జరిమానాలు కూడా విధించనున్నట్లు ప్రకటించారు. ఈ అంశంపై శశిథరూర్ స్పందించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందాలు కొనసాగుతున్న సమయంలో అమెరికా నుంచి ఇలాంటి ప్రకటనలు సరైంది కాదని అభిప్రాయపడ్డారు. భారత దేశం నుంచి చేసే ఎగుమతులకు అమెరికా అత్యంత ముఖ్యమైన మార్కెట్‌గా ఉన్నట్లు గుర్తుచేశారు. గతంలో భారతదేశం 87 – 90 బిలియన్ డాలర్ల మేర ఎగుమతులను అమెరికాకు పంపిందని వివరించారు. ట్రంప్, రష్యా నుండి దిగుమతులు చేసే విషయంలో కూడా సుంకాలు విధిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇలాంటి చర్యలు వాణిజ్య చర్చల భాగంగా హెచ్చరికలుగా ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఎగుమతులపై విధించబడే టారిఫ్‌లు భారత్‌కు నష్టం కలిగిస్తాయని, తద్వారా మన జీడీపీపై కూడా ప్రతికూల ప్రభావం పడొచ్చని శశిథరూర్ చెప్పారు. అమెరికా డిమాండ్లపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డిమాండ్లను ప్రతిఘటించే హక్కు భారత్‌కు ఉన్నదని, తమ జాతీయ ప్రయోజనాలను కాపాడుకోవాలని అన్నారు. వీరి ఒత్తిడికి మన దేశం తలొగ్గడం, మన జీవనోపాధిని పణంగా పెట్టడం తప్పని చెప్పడం ద్వారా, భారత్ తన స్వతంత్ర వాణిజ్య విధానాన్ని అనుసరించాలన్నారు. ట్రంప్ టారిఫ్‌ల విషయంలో, భారత్ ప్రభుత్వ విధానంపై నమ్మకం ఉంచినట్లు శశిథరూర్ చెప్పారు. భవిష్యత్తులో ఈ విషయం చర్చల ఆధారంగా క్లారిటీ వస్తుందని, అమెరికా ఒత్తిడికి భారతదేశం తలొగ్గకుండా సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన సూచించారు.