Shashi Tharoor : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకు, శశి థరూర్‌కు మధ్య దూరం పెరిగిందనే విమర్శలకు స్వయంగా శశి థరూర్ చెక్ పెట్టారు. గురువారం ఆయన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు ఖర్గే, మరో అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు. పార్లమెంట్ హౌస్‌లో, ఖర్గే ఛాంబర్లో తాను ఇద్దరు నేతలను కలిసినట్లు శశి థరూర్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోను పంచుకున్నారు. ఇద్దరికీ ధన్యవాదాలు తెలిపారు.
అనేక అంశాలపై చర్చించినట్లు, దేశానికి సేవ చేసే అంశంలో కలిసి సాగుతున్నట్లు శశి థరూర్ పేర్కొన్నారు. దాదాపు 30 నిమిషాలపాటు వీరు పలు రాజకీయ అంశాలపై చర్చించినట్లు సమాచారం. పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యేందుకు వచ్చిన సందర్భంగా ఇద్దరు నేతలను కలుసుకున్నానని, ఇందులో ప్రత్యేకత ఏముంటుందని ఆయన మీడియాకు తెలిపారు. కొంతకాలంగా శశి థరూర్‌కు, పార్టీలోని అగ్రనాయకత్వానికి మధ్య దూరం పెరిగిందనే ప్రచారం జరిగింది. ఇటీవల ఢిల్లీలో జరిగిన సమావేశానికి కూడా శశి థరూర్ గైర్హాజరయ్యారు. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి దూరమవుతున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇదే అంశంపై కొందరు కాంగ్రెస్ నేతలు శశి థరూర్‌పై మండిపడ్డారు.
థరూర్ 17 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఆయన కాంగ్రెస్ తరఫున ఎంపీగా కేరళలోని తిరువనంతపురం నుంచి, 2009 నుంచి వరుసగా పోటీ చేసి గెలుస్తున్నారు. అయితే, ఆపరేషన్ సింధూర్ విషయంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలపడం.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడంతో వివాదం మొదలైంది. తాజాగా ఆయన ఈ వివాదానికి చెక్ పెడుతూ.. కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని కలిశారు.