తిరువనంతపురం: మహారాష్ట్రలోని అధికార బీజేపీకి చెందిన మంత్రి నితేష్ రాణే ‘ఈవీఎం’పై చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ (Shashi Tharoor) ఖండించారు. ఆయన వ్యాఖ్యలు చాలా దిగ్భ్రాంతికరమని తెలిపారు. ఒక సమాజం లేదా కులాన్ని ఇలా ఆపాదించడం తప్పని అన్నారు. శుక్రవారం మహారాష్ట్రలోని సాంగ్లిలో జరిగిన హిందూ గర్జన సభలో బీజేపీ మంత్రి నితేష్ రాణే మాట్లాడారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రం (ఈవీఎం)కు కొత్త భాష్యం చెప్పారు. ‘ఈవీఎం అంటే ముల్లాకు వ్యతిరేకంగా ప్రతి ఓటు’ అని అన్నారు.
కాగా, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ దీనిపై స్పందించారు.‘ఇది చాలా దిగ్భ్రాంతికరమైన విషయం. మన దేశంలో స్వాతంత్ర్య పోరాటం ప్రాథమిక పాఠాన్ని మనం నిజంగా అర్థం చేసుకోవాలి. ఒక వర్గం ప్రజలు వారి జాతీయతకు ఆధారం మతం అని చెప్పినప్పుడు వారు వెళ్లి పాకిస్థాన్ సృష్టించుకున్నారు. మనమందరం భారతదేశానికి సమానమైన వ్యక్తిగత పౌరులం. మన దేశం అభివృద్ధి చెందడానికి అదే ఏకైక ఆధారం’ అని అన్నారు.
మరోవైపు సీపీఎం నాయకురాలు బృందా కారత్ కూడా నితేష్ రాణే వ్యాఖ్యలను ఖండించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, కేరళను మినీ పాకిస్థాన్‌గా నితేష్ రాణే ఇటీవల అనడంపై వివాదం చెలరేగింది. అలాగే గత ఏడాది సెప్టెంబర్‌లో ముస్లింలపై ద్వేషపూరిత ప్రసంగం చేసిన ఆయనపై కేసు కూడా నమోదైంది.