Shashi Tharoor : బీజేపీ-ఆరెస్సెస్ (BJP-RSS) లకు ఉన్న సంస్థాగత బలాన్ని మెచ్చుకుంటూ.. కాంగ్రెస్ శక్తిమంతం కావాల్సి ఉందని అభిప్రాయపడుతూ.. సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ (Digvijaya Singh) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలైన కాంగ్రెస్ పార్టీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో దిగ్విజయ్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో నేత శశిథరూర్ (Shashi Tharoor) మద్దతు పలికారు.
కాంగ్రెస్ పార్టీ 140వ వ్యవస్థాపక దినోత్సవం జరుపుకుంటున్న నేపథ్యంలో థరూర్ వ్యాఖ్యలు ఆ పార్టీ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దిగ్విజయ్ వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించగా.. తమ సంస్థ బలోపేతం కావాలని తాను కూడా కోరుకుంటున్నట్లు థరూర్ తెలిపారు. దీనిపై ఎలాంటి చర్చ అవసరం లేదన్నారు. ఏ పార్టీలో అయినా క్రమశిక్షణ అవసమన్నారు. నేడు పార్టీకి చాలా ముఖ్యమైన రోజని, మనకు 140 ఏళ్ల చరిత్ర ఉందని, పార్టీ నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చని చెప్పారు.
కాగా శనివారం ప్రధాని మోదీకి చెందిన పాత ఫొటోను దిగ్విజయ్ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆరెస్సెస్‌లో సామాన్య కార్యకర్త నుంచి ప్రధానిగా మోదీ ఎదిగిన విధానాన్ని ఆయన కొనియాడారు. ఇది బీజేపీ-ఆరెస్సెస్‌కు ఉన్న సంస్థాగతమైన శక్తి అని అభివర్ణించారు. ఈ పోస్టుపై తర్వాత ఆయన మాట్లాడుతూ.. బీజేపీ-ఆరెస్సెస్‌కు తాను వ్యతిరేకినన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.