Rahul Gandhi | న్యూఢిల్లీ, డిసెంబర్ 6: ‘రాహుల్‌గాంధీ ఆఫీసుకు ఏ.ఎం, పీ.ఎంకి మధ్య తేడా తెల్వదు, వారు రేపొద్దున ప్రధాని కార్యాలయాన్ని ఎలా నడుపుతారు?’ అంటూ మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యానించారట. ఒకానొకరోజు రాహుల్‌గాంధీ సాయంత్రం తనను కలవాల్సి ఉండగా, ఆయన కార్యాలయ సిబ్బంది మాత్రం ఆయనకు ఉదయం కలవాలని సమాచారమిచ్చారని పేర్కొంటూ ఆయన పై వ్యాఖ్యలు చేశారు. గాంధీ-నెహ్రూ కుటుంబాల వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన రాహుల్‌గాంధీకి రాజకీయ చతురత మాత్రం వారసత్వంగా అబ్బలేదని ప్రణబ్ అభిప్రాయపడ్డారట.
ఈ విషయాల్ని ఆయన కొన్నేండ్ల కిందట తన డైరీలో రాసుకున్నారట. తన తండ్రి జీవితంపై రాసిన పుస్తకంలో ఈ అంశాల్ని ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠ ముఖర్జీ ప్రస్తావించారు. ‘ఇన్ ప్రణబ్, మై ఫాదర్ : ఏ డాటర్ రిమెంబర్స్’ పేరుతో శర్మిష్ఠ ఈ పుస్తకాన్ని రచించారు. ప్రణబ్ డైరీతోపాటు ఆయన రాజకీయ జీవితంపై అధ్యయనం చేసి ఆమె ఈ పుస్తకాన్ని రాశారు. ఇందులో గాంధీ కుటుం బం, రాహుల్‌గాంధీ రాజకీయ భవిష్యత్తు.. మొదలైన అంశాలను వివరించారు. రాహుల్‌గాంధీ గురించి ప్రణబ్ తన డైరీలో రాసుకున్న అభిప్రాయాలను శర్మిష్ఠ తన పుస్తకంలో ప్రస్తావించారు. 2020లో కన్నుమూసిన ప్రణబ్ ముఖర్జీ, తన రాజకీయ జీవితంలో గాంధీ కుటుంబంలో మూడు తరాలకు చెందినవారితో కలిసి పనిచేశారు.