Ayodhya Ram Mandir | హైదరాబాద్, జనవరి 11 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంపై ప్రతిపక్ష పార్టీలతోపాటు శంకరాచార్య పీఠాధిపతులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవాన్ని బీజేపీ ఓ రాజకీయ ప్రచారంగా మార్చిందని ధ్వజమెత్తారు. సనాతన ధర్మం, శాస్త్ర విధులు, ఆచారాలకు అనుగుణంగా విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడం లేదని మండిపడ్డారు. జనవరి 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు తామెవ్వరం హాజరుకాబోమని తేల్చిచెప్పారు. ఈ మేరకు ఉత్తరాఖండ్‌లోని జ్యోతీష్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య అవిముక్తేశ్వరానంద సరస్వతి, గుజరాత్‌లోని ద్వారకా పీఠాధిపతి శంకరాచార్య శ్రీ స్వామి సదానంద సరస్వతి, ఒడిశాలోని పూరీ పీఠాధిపతి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి వెల్లడించినట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానించారు. అయినా వెళ్లబోను. ఇది దైవకార్యంగా లేదు. రాజకీయ ప్రచారంలాగా కనిపిస్తున్నది.లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తున్నట్టు అర్థమవుతున్నది. శ్రీరాముని విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తూ ఉంటే, పీఠాధిపతులమైన మేము బయట ఉండి చప్పట్లు కొట్టాలా? అభివృద్ధి పేరిట పుణ్యక్షేత్రాలను పర్యాటక కేంద్రాలుగా మార్చుతున్నారు. తీర్థ స్థలాలు భోగస్థలాలుగా మారుతున్నాయి.
-పూరీ పీఠాధిపతి శంకరాచార్య నిశ్చలానంద సరస్వతి
భారత్‌లో రాజకీయ నేతలు మఠాధిపతుల అవతారమెత్తుతున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారు. అయోధ్య వేడుకకు వెళ్లబోం. అయితే, ఈ చర్యతో మేం ప్రధాని మోదీకి వ్యతిరేకం అని అనుకోవద్దు. అయోధ్య వేడుకలో శాస్త్ర విధి, ఆచారాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. రామాలయం నిర్మాణం పూర్తికాకుండానే పూజాదికాలు జరుగుతున్నాయి. పూర్తికాని దేవాలయంలో ప్రాణ ప్రతిష్ఠ చేయడాన్ని ఎలా ఆమోదిస్తాం??
– జ్యోతీష్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి