శ్రీనగర్: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు మహిళా అభ్యర్థులు మాత్రమే విజయం సాధించారు. (Three women elected to JK Assembly ) మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను 41 మంది మహిళలు ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే కశ్మీర్ ప్రాంతం నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ)కు చెందిన ఇద్దరు మహిళలు, జమ్ము ప్రాంతం నుంచి బీజేపీకి చెందిన ఒక మహిళా అభ్యర్థి మాత్రమే ఈసారి ఎన్నికల్లో గెలిచారు. జమ్ములోని కిష్త్వార్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థిని షగుణ్ పరిహార్ 521 ఓట్ల తేడాతో విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) అభ్యర్థి, మాజీ మంత్రి సజ్జాద్ అహ్మద్ కిచ్లూ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్నప్పటికీ ఆయనను ఓడించారు.
కాగా, 29 ఏళ్ల షగుణ్ పరిహార్, ఎలక్ట్రికల్ పవర్ సిస్టమ్స్‌లో ఎంటెక్ డిగ్రీ పట్టా పొందారు. రిసెర్చ్ స్కాలర్ అయిన ఆమె పీహెచ్‌డీని కొనసాగిస్తున్నారు. బీజేపీ అభ్యర్థిగా ఆమెను నామినేట్ చేసే సమయానికి జమ్ముకశ్మీర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షకు సిద్ధమవుతున్నారు. 2018లో షగుణ్ తండ్రి అజిత్ పరిహార్, ఆమె సోదరుడైన నాటి బీజేపీ రాష్ట్ర కార్యదర్శి అనిల్ పరిహార్‌ను పంచాయితీ ఎన్నికలకు ముందు ఇంటి సమీపంలో ఉగ్రవాదులు కాల్చి చంపారు.
మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) సీనియర్ నాయకురాలు, ఆ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలైన షమీమా ఫిర్దౌస్, కశ్మీర్‌లోని హబ్బకాడల్ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ అభ్యర్థి అశోక్ కుమార్ భట్‌పై 9,538 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2008, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా రెండు సార్లు ఆ స్థానం నుంచి ఆమె గెలుపొందారు.
కాగా, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సకీనా ఇటూ, దక్షిణ కశ్మీర్ కుల్గాం జిల్లాలోని డీహెచ్ పోరా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎన్నికల్లో పోటీ చేశారు. పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) కి చెందిన గుల్జార్ అహ్మద్ దార్‌పై 17,449 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గతంలో సాంఘిక సంక్షేమం, పరిపాలనా సంస్కరణలు, విద్య, పర్యాటకంతో పలు శాఖల మంత్రిగా సకీనా పనిచేశారు. 1996లో తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచినప్పుడు ఆమె వయస్సు 26 ఏళ్లు. నాడు జమ్ముకశ్మీర్ శాసనసభలో అతి పిన్న వయస్కురాలుగా ఖ్యాతి గడించారు.