SGPC Dhami | మొహలీలో శిరోమణ గురుద్వార్ ప్రభందక్ కమిటీ (ఎస్జీపీసీ) చీఫ్ హర్జిందర్ సింగ్ ధామీ వాహనంపై ఆందోళనాకారులు దాడి చేశారు. వీరి దాడిలో ఆయన కారు ధ్వంసమైంది. సిక్కు ఖైదీల విడుదలకు సంబంధించి మొహలీలో పెద్ద సంఖ్యలో సిక్కులు బైఠాయించారు. వీరిని కలిసేందుకు వచ్చిన ధామీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారు ఈ దాడికి పాల్పడ్డారు. సిక్కు ఖైదీల విడుదల కోసం గత కొన్ని రోజులుగా మొహలీలో ఆందోళనలు జరుగుతున్నాయి.
ఎస్జీపీసీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టిందని ధామి ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలిపారు. సిక్కు ఖైదీలను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వేదిక పైనుంచి కిందికి దిగి కారులో కూర్చుంటుండగా.. ఆందోళనాకారులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు దూసుకువచ్చారు. కొందరు రాళ్లు, కర్రలతో ఆయన వాహనంపై దాడి చేశారు. దాడిలో కారు అద్దాలు పగిలిపోయాయి. సిక్కులకు సంబంధించిన సమస్యలపై ఎస్జీపీసీ ఏమీ చేయలేదని, ఈ అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని ఆందోళనాకారులు మండిపడ్డారు. ఆందోళన తీవ్రస్థాయికి చేరుకోవడంతో కొందరు తమ వారిని శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
సిక్కు ఖైదీల విడుదల కోసం ఎస్జీపీసీ 2014 నుంచి పోరాడుతున్నదని ఎస్జీపీసీ చీఫ్ ధామి వెల్లడించారు. వచ్చే నెలలో గవర్నర్ను కలిసి వినతిపత్రం ఇచ్చేందుకు కూడా కార్యాచరణ రూపొందించామని తెలిపారు. కోమి ఇన్సాఫ్ మోర్చా ఆహ్వానం మేరకే గోబింద్సింగ్ లోంగోవాల్తో కలిసి అక్కడికి వచ్చానని ధామి చెప్పారు. ఆందోళనాకారులు కోపంతో ఉండటం వలన ఈ సంఘటన జరిగిందని, అంతేకానీ తనను కావాలని కొట్టలేదని ధామి పేర్కొన్నారు.