జైపూర్, జూన్ 7: బీజేపీ పాలిత రాజస్థాన్‌లోని అల్వర్‌లో గల ఈఎస్ఐసీ వైద్య కళాశాలకు చెందిన ఐసీయూ వార్డులో ఓ 32 ఏండ్ల మహిళపై దవాఖాన నర్సింగ్ సిబ్బందిలో ఒకడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జూన్ 4వ తేదీ రాత్రి జరిగిన ఈ దారుణంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు బాధిత మహిళకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి రేప్‌నకు పాల్పడినట్టు తెలిసింది. లైంగిక దాడి జరిగిన తర్వాత బాధితురాలు తన భర్త కోసం కలవరిస్తుండగా వెంటనే సిబ్బంది ఆయనను లోపలకు పిలిపించారు. అయితే పూర్తి మత్తులో ఉన్న ఆమె ఏమీ చెప్పలేక నిద్రలోకి జారుకుంది. ఉదయం స్పృహలోకి వచ్చిన తర్వాత తనకు జరిగిన అన్యాయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు వెంటనే దవాఖాన పాలనాధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే వారు ఈ వ్యవహారాన్ని తొక్కిపెట్టేందుకు ప్రయత్నించారు. అధికారుల సమక్షంలో నిందితుడు తమను క్షమాపణలు కోరినట్లు బాధితురాలి భర్త ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలి భర్త అదనపు జిల్లా మెజిస్ట్రేట్ దృష్టికి మొత్తం వ్యవహారం తీసుకువెళ్లడంతో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్‌ని సమీక్షించిన పోలీసులు నిందితుడి అరెస్టు కోసం చర్యలు చేపట్టారు.
కుక్క నోట్లో మృత శిశువు
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఇండోర్ జిల్లాలోని ప్రభుత్వ దవాఖానలో ఓ నవజాత మృత శిశువును వీధి కుక్క నోటితో కరుచుకుని తీసుకెళుతుండగా అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు అడ్డుపడడంతో మృత శిశువును వదిలిపెట్టి కుక్క పారిపోయింది. దవాఖానలోని టాయిలెట్ వద్ద శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు ఈ ఘటన పూర్వాపరాలను వెలికితీస్తున్నారు. శనివారం ఓ 17 ఏండ్ల బాలిక టాయిలెట్‌కు వెళ్లడం సీసీటీవీ ఫుటేజీలో కనిపించినట్లు పోలీసులు చెప్పారు. కడుపునొప్పితో దవాఖానలో చేరిన ఆ బాలిక టాయిలెట్లో ప్రసవించి ఉంటుందని అనుమానిస్తున్నట్లు దవాఖాన ఇన్చార్జ్ డాక్టర్ వర్మ తెలిపారు.