జైపూర్: రాజస్థాన్లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగాలిప్పిస్తామని మభ్యపెట్టి ఒక ప్రజాప్రతినిధి, ఒక ఉన్నతాధికారి మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. ఇంత దారుణానికి పాల్పడినా కేసు నమోదు చేయడానిక పోలీసులు నిరాకరించడంతో బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి సిరోచి మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడ, మున్సిపల్ కౌన్సిల్ మాజీ కమిషనర్ మహేంద్ర చౌదరి 20 మంది మహిళలపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
దానిని వీడియో తీసి తమకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోతే వాటిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేస్తామంటూ బాధితులను తీవ్రంగా బెదిరించారు. అయితే బాధితుల్లో ఒకరు పాలి జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమెకు మద్దతుగా మరికొందరు రావడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీలో ఉద్యోగం ఇప్పిస్తామని వీరిని కొన్ని నెలల క్రితమే రప్పించారు. మత్తుమందు కలిపిన భోజనాన్ని పెట్టి సామూహిక లైంగిక దాడికి పాల్పడి, దానిని వీడియో తీసి బెదిరించే వారు. స్వప్రయోజనాల కోసం వారిని లైంగికంగా వాడుకునే వారు.