Bhavani Revanna | అశ్లీల వీడియోల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న సస్పెండెడ్ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణ పరారీలో ఉన్నారు. ఇంటి వద్ద ఉండాలని నోటీసులు జారీ చేసినా ఆమె ఇంట్లో లేరని పోలీసులు తెలిపారు. లైంగిక దాడి, కిడ్నాపింగ్ కేసుల్లో భవానీ రేవణ్ణ భర్త హెచ్డీ రేవణ్ణ కూడా నిందితుడే. మాజీ ప్రధాని, జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ కోడలు భవానీ రేవణ్ణ. ఇదే కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భవానీ రేవణ్ణ దాఖలు చేసిన పిటిషన్ను శుక్రవారం స్థానిక కోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇంటి పని సహాయకురాలి కిడ్నాపింగ్ కేసులో భవానీ రేవణ్ణ పాత్రను పరిశీలించాల్సి ఉంటుందని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (ఎస్ఐటీ) పేర్కొంది.
‘కేఆర్ నగర్ కిడ్నాప్ కేసుతో మీ పాత్రపై వివరణ కోసం మిమ్మల్ని మేం విచారిస్తాం. ఇంటిలోనే ఉండాలి’ అని సిట్ తన నోటీసులో పేర్కొంది. ‘మీ అంగీకారం మేరకే శనివారం వ్యక్తిగతంగా విచారణకు అందుబాటులో ఉండాలని మేం కోరాం. మహిళా పోలీసు అధికారులతో జూన్ ఒకటో తేదీ ఉదయం 10 గంటలకు మిమ్మల్ని ప్రశ్నించేందుకు మేం వస్తాం. మీరు ఇంట్లోనే ఉండాలని కోరతున్నాం’ అని ఆ నోటీసు పేర్కొంది. కానీ సిట్ ఆఫీసర్లు ఇంటికి వెళ్లినప్పుడు ఆమె ఆచూకీ కనిపించలేదు. ఆమె మొబైల్ ఫోన్కు ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ అని వస్తున్నది. ఒకవేళ ఆమె ఇంటికి వస్తే ప్రశ్నించేందుకు సాయంత్రం ఐదు గంటల వరకూ ఇంటి వద్దే సిట్ వేచి ఉన్నది. భవానీ రేవణ్ణ, ఆమె కుటుంబ సభ్యులు పలుకుబడి గల వారని, సాక్ష్యాధారాలను తారుమారు చేయగలరని సిట్ ఆరోపించింది.