న్యూఢిల్లీ, జనవరి 24: అమెరికా వ్యాప్తంగా విరుచుకుపడిన మంచు తుఫాను కారణంగా 8 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. టెక్సాస్ నుంచి ఉత్తర కరోలినా దాకా భారీ హిమపాతం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. శనివారం దాదాపు 3,400 విమానాలు ఆలస్యంగా నడిచాయి లేదా రద్దయ్యాయి. ఆదివారం మరో 5,000 విమానాలు రద్దు అయినట్లు విమానాలను ట్రాక్ చేసే వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ పేర్కొంది. న్యూ మెక్సికో నుంచి న్యూ ఇంగ్లండ్ వరకు దాదాపు 4 కోట్ల మంది మంచు తుఫాను బారిన పడనున్నారు. హిమపాతం తీవ్రంగా ఉండే ప్రాంతాల్లో తుఫాను వంటి విపత్కర పరిస్థితి తలెత్తవచ్చని హెచ్చరికలు జారీ అయ్యాయి.
టెక్సాస్, ఓక్లహామ, కన్సాస్‌లోని అనేక ప్రాంతాలలో శుక్రవారం భారీ హిమపాతం ఏర్పడింది. ఆర్కిటిక్ నుంచి వీస్తున్న చలి గాలులకు ప్రజలు గజగజ వణుకుతున్నారు. ఈ శీతాకాలంలో ఇదే భారీ మంచు తుఫాను అని మేరీలాండ్‌లోని వాతావరణ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త జాకబ్ అషర్మాన్ తెలిపారు. డకోటాస్, మిన్నేసోటాలో ఉష్ణోగ్రత మైనస్ 45 డిగ్రీలకు పడిపోయింది. డజనుకుపైగా రాష్ర్టాలకు చెందిన గవర్నర్లు ప్రజలను ఇండ్ల నుంచి బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. దక్షిణ, తూర్పు అమెరికా వ్యాప్తంగా కనీసం 16 కోట్ల మందిపై మంచు తుఫాను ప్రభావం చూపనున్నది. .