న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3: ఉష్ణమండల పసిఫిక్ ప్రాంతంలో ఎల్ నినో తీవ్రత గణనీయంగా పెరిగింది. ఇది ఈ ఏడాది చివరి నాటికి అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకుంటుందని అంచనా. అంతేగాకుండా ఇది 2027 ఫిబ్రవరి వరకు కచ్చితంగా ఉంటుందని ప్రపంచ వాతావరణ సంస్థ(డబ్ల్యూఎంవో) హెచ్చరించింది. ఈ హెచ్చరిక కేవలం దీని కొనసాగింపునకు మాత్రమే పరిమితం కాదు.
ఈ ఏడాది చివరి వరకు ప్రస్తుత ఉష్ణోగ్రత పెరుగుదల ధోరణి కొనసాగితే ఆధునిక పర్యవేక్షణ ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత శక్తివంతమైన ఎల్ నినోగా ఇది మారే అవకాశం ఉందని డబ్ల్యూఎంవో అధికారులు తెలిపారు. ఎల్ నినో తీవ్రతకు సంబంధించి ఆ సంస్థ ఇంతటి అధిక స్థాయి విశ్వాసాన్ని వ్యక్తం చేయడం ఇదే మొదటిసారి అని గురువారం విడుదలైన తాజా డబ్ల్యూఎంవో నివేదిక సూచిస్తున్నది. సముద్రపు ఉష్ణోగ్రతలు అసాధారణంగా ఎక్కువగా ఉండటం వల్ల ఎల్ నినో మరింత బలపడుతున్నదని, దీనికి సంబంధించిన వాతావరణ ప్రభావాలు 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని ఆ సంస్థ పేర్కొంది.
భారత్‌పై ప్రభావం
ఎల్ నినో అన్ని ప్రాంతాలలో ఒకే రకమైన వాతావరణ పరిస్థితులను సృష్టించదు. అలాగే ఒక నిర్దిష్ట దేశం ఎంత తీవ్రంగా ప్రభావితమవుతుందనేది కేవలం దాని తీవ్రతపైనే ఆధారపడి ఉండదు. అయితే భారత్‌కు సంబంధించినంత వరకు ఇది నైరుతి రుతుపవనాలపై తీవ్ర ప్రభావం చూపి పొడి వాతావరణ పరిస్థితులకు దారితీయవచ్చని అంచనా. చారిత్రకంగా ఎల్ నినో తరచుగా బలహీనమైన రుతుపవన వర్షపాతంతో ముడిపడి ఉంటుంది. అయితే ఈ సంబంధం కచ్చితమైనది కాదు.
ఇతర అంశాలు ఫలితాన్ని మార్చగలవని అధికారులు తెలిపారు. 2026 రుతుపవనాల వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉంటుందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) ముందే అంచనా వేసింది. ఇప్పటివరకు అలాగే నమోదైంది. మే నెలలో విడుదల చేసిన సవరించిన అంచనాలో ఐఎండీ ఈ సీజన్ వర్షపాతం దీర్ఘకాలిక సగటు(ఎల్పీఏ)లో 90 శాతం ఉంటుందని, అలాగే లోటు వర్షపాతం ఉండేందుకు 60 శాతం అవకాశం ఉందని పేర్కొంది. నిరాశాజనక అంచనాలకు అనుగుణంగానే 16 శాతం లోటు వర్షపాతంతో భారత్ ఆగస్టు నెలను ముగించింది.
అంతేగాకుండా సెప్టెంబర్-నవంబర్ కాలంలో దాదాపు అన్ని భూభాగాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని డబ్ల్యూఎంవో తాజా అంచనా సూచిస్తున్నది. అదే సమయంలో వర్షపాత సరళి ప్రాంతాల వారీగా మారుతుందని కూడా హెచ్చరిస్తున్నది. అత్యంత తీవ్రమైన ఎల్ నినో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో విపరీతమైన వేడి, కరువు, వరదల అవకాశాలను పెంచవచ్చు. అయితే ప్రతి ప్రాంతంపై ఒకే విధమైన ప్రభావం ఉండే అవకాశం లేదు. 2027 ప్రారంభం వరకు ఎల్ నినో కొనసాగుతుందని అంచనా వేస్తున్నందున దాని వల్ల సంభవించే పర్యవసానాలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వాలు సన్నద్ధంగా ఉండాలని డబ్ల్యూఎంవో అధికారులు సూచించారు.