New Delhi : ఢిల్లీలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఒక బిల్డింగ్ కూలి ఒకరు మరణించారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటన న్యూఢిల్లీలోని, రోహిణి సెక్టార్ 16లో బుధవారం సాయంత్రం 4.20 గంటలకు జరిగింది. భారీ వర్షాల కారణంగానే నిర్మాణంలో ఉన్న ఈ బిల్డింగ్ కూలినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించిన కారణాలు తెలియాల్సి ఉంది. బిల్డింగ్ కూలిన వెంటనే స్థానిక పోలీసులు, ఫైర్ సిబ్బందికి వెంటనే సమాచారం అందింది. దీంతో పోలీసులు, ఢిల్లీ ఫైర్ సిబ్బంది సహా ఇతర రెస్క్యూ బృందాలు ఘటనా స్తలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.
ఈ ఘటనలో ఒకరు మరణించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద మరో నలుగురు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. అయితే, శిథిలాల కింద ఎంతమంది ఉన్నారు అనేదానిపై ఇంకాస్పష్టత లేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్లకు సంబంధించిన సిబ్బంది పని చేస్తుండగా, అంబులెన్స్‌లను అధికారులు సిద్ధంగా ఉంచారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. మరోవైపు ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇంకా వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. ఢిల్లీలోని పలు ప్రాంతాలకు ఇప్పటికే ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్, కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించారు.
40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఢిల్లీలో సాధారణ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీలకు పడిపోగా, 14.2 ఎంఎం సగటు వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల కారణంగా ఢిల్లీలో జనజీవనం స్తంభించింది. ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. కొన్నిచోట్ల బైకులు మునిగిపోయేంత నీరు నిలిచిపోయింది. దీంతో ఎక్కువమంది మెట్రోలో ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.