Rabies vaccine : కేరళ (Kerala) లో రేబిస్ వ్యాక్సిన్ (Rabies vaccine) పనిచేయక మరో చిన్నారి మరణించింది. కుక్కకాటుకు గురైన ఏడేళ్ల బాలిక రేబిస్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ అది సరిగా పనిచేయక రేబిస్ సోకింది. తిరువనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. కొల్లామ్ జిల్లా (Kollam district) లోని కున్నికోడ్ (Kunnicode) ప్రాంతానికి చెందిన ఏడేళ్ల నియా ఫైసల్ (Niya Faisal) ను కొన్ని రోజుల క్రితం వీధి కుక్క కరిచింది.
దాంతో తల్లిదండ్రులు ఆమెకు రేబిస్ వ్యాక్సిన్ ఇప్పించారు. అయినా ఇటీవల బాలిక ప్రవర్తనలో మార్పు రావడంతో ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షల్లో ఆమెకు రేబిస్ పాజిటివ్‌గా తేలింది. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది. అయితే రేబిస్ వ్యాక్సిన్ పనిచేయక చిన్నారులు మరణించడం ఇదే తొలిసారి కాదు. ఈ ఒక్క నెలలోనే ఇది మూడో మరణం.
కొన్ని రోజుల క్రితమే మలప్పురం జిల్లాకు చెందిన జియా ఫారిస్ రేబిస్ వ్యాక్సిన్ పనిచేయక వ్యాధి సోకి మరణించింది. అంతకుముందు పతనంతిట్ట జిల్లాకు చెందిన 13 ఏళ్ల బాలిక వ్యాక్సిన్ తీసుకున్నా రేబిస్ బారినపి చనిపోయింది. రేబిస్ వ్యాక్సిన్ పనిచేయకపోవడంతో స్థానికుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. వీధికుక్కలను నియంత్రించాలని, సరైన వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేస్తున్నారు.