పట్నా: బీహార్లో మరో విషాదం చోటుచేసుకుంది. నలంద జిల్లాలో కల్తీ మద్యం సేవించి ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీహార్లో గతంలో కూడా కల్తీ మద్యం సేవించి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. కల్తీ మద్యాన్ని ఎవరు తయారు చేస్తున్నారు..? బాధితులు ఆ మద్యాన్ని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు..? అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
మృతుల కుటుంబసభ్యులను విచారించి వాంగ్మూలాలను నమోదు చేశారు. మృతుల్లో ఇద్దరు డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. మృతులందరి కుటుంబసభ్యులు మాత్రం కల్తీ మద్యమే తమవాళ్ల మరణానికి కారణమని వాంగ్మూలాల్లో పేర్కొన్నారు. ఇదిలావుంటే.. బీహార్లో మద్య నిషేధమే ఈ కల్తీ మద్యం చావులకు కారణమని ఆ రాష్ట్ర బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు.
బీహార్లో పేరుకే మద్యం నిషేధం అమలులో ఉన్నదని, వాస్తవంలో ఎక్కడ చూసిన కల్తీ మద్యం దందా యథేచ్ఛగా కొనసాగుతున్నదని బీహార్ బీజేపీ అధికార ప్రతినిధి ప్రేమ్ రంజన్ పటేల్ ఆరోపించారు. ఈ కల్తీ మద్యం చావులు ఆగాలంటే మద్య నిషేధంపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మద్యం నిషేధం కారణంగా రాష్ట్రంలో లిక్కర్ మాఫియాలు తిష్టవేశాయని.. అధికారులు, పోలీసులు కూడా వాళ్లకు సహకరిస్తున్నారని రంజన్ పటేల్ మండిపడ్డారు.