రాంచి, జూన్ 18: జార్ఖండ్‌లో జరిగిన రెండు రాజ్యసభ సీట్ల ఎన్నికల్లో కాంగ్రెస్‌కు షాక్ తగిలింది. తగినంత మెజారిటీ ఉన్నా తన అభ్యర్థిని గెలిపించుకోలేకపోయింది. జార్ఖండ్‌లో మొత్తం 81 ఎమ్మెల్యే సీట్లున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 24 మంది ఎమ్మెల్యేలు, అధికార కాంగ్రెస్-జేఎంఎం, ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) కూటమికి 56 మంది ఎమ్మెల్యేలున్నారు. రాజ్యసభ సీటుకు 28 మొదటి ప్రాధాన్య ఓట్లు కావాలి. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆఫీస్ ఇన్చార్జిగా ఉన్న ప్రణవ్ ఝాను ఒక సీటులో పోటీ చేయించారు. కానీ ఎన్డీయే మద్దతుతో స్వతంత్ర అభ్యర్థి పరిమళ్ నత్వానీ 28 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణవ్ ఝా మీద గెలిచారు.
ప్రణవ్‌కు 20 ఓట్లే వచ్చాయి. బీజేపీ బలపరచిన నత్వానీకి 24 మందితో 4 ఓట్లు తక్కువగా ఉన్నాయి. కానీ నత్వానీ గెలుపుతో క్రాస్ ఓటింగ్ జరిగిందని తేలిపోయింది. దీంతో తన మిత్రపక్షాలైన ఆర్జేడీ, సీపీఐ(ఎంఎల్) ఓటు వేయకుండా ద్రోహం చేశాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఆరోపణలను సీపీఐ(ఎంఎల్) తిప్పికొట్టింది. ఆ రెండు పార్టీల్లో ఎవరూ క్రాస్ ఓటింగ్ వేయలేదని స్పష్టం చేసింది. దీంతో కాంగ్రెస్ కూటమి మధ్య చిచ్చు మొదలైంది. ఇక రెండో రాజ్యసభ సీటును జేఎంఎం అభ్యర్థి బైద్యనాథ్ రామ్ 30 ఓట్లతో గెలుచుకున్నారు. ఇక పోలైన ఓట్లలో మూడు చెల్లనివిగా గుర్తించారు. అందులో రెండు బీజేపీ ఎమ్మెల్యేలవి కాగా ఒకటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వేసినది.
మహారాష్ట్రలో మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)లో రాజకీయ పరిణామాలు చకచకా మారుతున్నాయి. ఆ పార్టీలో రెండోసారి చీలిక దాదాపు ఖాయమైపోయింది. తొమ్మిది మంది లోక్‌సభ ఎంపీలలో ఆరుగురు వేరు కుంపటికి సిద్ధమైపోయారు. తమ వర్గాన్ని షిండే శివసేనలో కలుపాలంటూ స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. దేశ రాజధానిలో గురువారం జరిగిన అతి ముఖ్యమైన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ఈ ఆరుగురు ఎంపీలు గైర్హాజరై విప్‌ను ధిక్కరించి పార్టీపై తిరుగుబాటును అధికారికంగా ప్రకటించారు. మొత్తం తొమ్మిది మంది ఎంపీలకు ముగ్గురు మాత్రమే ఈ సమావేశానికి హాజరయ్యారు. సమావేశానికి ఏకైక రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్, ఇతర ఎంపీలు అరవింద్ సావంత్, అనిల్ దేశాయ్, రాజాభావు వాజే మాత్రమే వచ్చారు. దీంతో పార్టీలో చీలిక నిర్ధారణ అయ్యింది.
కాగా, తమను షిండే నేతృత్వంలోని శివసేన పార్టీతో విలీనం చేయాలంటూ ఆరుగురు ఎంపీలు లేఖ రాసి లోక్‌సభ స్పీకర్‌ను బుధవారం కలిసినట్టు తెలిసింది. అంతేకాకుండా లోక్‌సభలో ఏక్నాథ్ షిండే పార్టీ ఎంపీలకు సమీపంలో తమకు సీట్లు కేటాయించాలని వారు స్పీకర్‌ను కోరారు. కాగా, ఈ ఆరుగురు రెబల్ ఎంపీలకు మహారాష్ట్ర పోలీసులు వై ప్లస్ భద్రతను కల్పించారు. ఆరుగురు రెబల్ ఎంపీలకు షోకాజ్ నోటీసులు పంపనున్నట్టు సమావేశ అనంతరం శివసేన లోక్‌సభ సభాపక్ష నాయకుడు సావంత్ మీడియాకు తెలిపారు. వారం రోజుల్లో దానికి స్పందించకపోతే వారిని అనర్హులను చేయాలంటూ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాయనున్నట్టు చెప్పారు.

తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీకి కలకత్తా హైకోర్టులో గురువారం ఎదురు దెబ్బ తగిలింది. శాసనసభలో విపక్ష నేతగా ఆ పార్టీ రెబల్ ఎమ్మెల్యే రితబ్రత బెనర్జీని స్పీకర్ నియమించడంపై స్టే ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. పార్టీ అధికారికంగా ఎంపిక చేసిన అభ్యర్థికి బదులుగా, తిరుగుబాటు టీఎంసీ ఎమ్మెల్యేలు తమ సొంత ప్రతిపక్ష నాయకుడిని నియమించుకొన్న నిర్ణయాన్ని ఆమోదించడానికి స్పీకర్ ఆసక్తిగా ఉన్నట్టు కోర్టు గమనించింది.
సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్‌కు చెందిన నాయకులు పార్టీ మారడానికి అధికార కూటమితో సంప్రదింపులు జరుపుతున్నారని ఉత్తరప్రదేశ్‌లో బీజేపీకి ప్రధాన మిత్రపక్షమైన నిషాద్ పార్టీ నాయకుడు, రాష్ట్ర మంత్రి సంజయ్ గురువారం వెల్లడించారు. ఇటీవల పలు రాజకీయ పార్టీల్లో జరుగుతున్న మార్పులు, ప్రతిపక్ష నాయకులు పార్టీలు ఫిరాయించడంపై ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో విఫలమైన నాయకులు తమ వాగ్దానాలు నెరవేర్చాలని ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని అన్నారు. పార్టీ ఫిరాయించడానికి ఎంతమంది విపక్ష ఎంపీలు సిద్ధంగా ఉంటారన్న ప్రశ్నకు దాదాపు రెండు డజన్లకు తగ్గకుండా ఉంటారు అని ఆయన తెలిపారు.