న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్, మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు షాక్ ఇచ్చారు. మే నెలలో కర్ణాటకలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka elections) పోటీ చేయాలని నిర్ణయించారు. సుమారు 40 నుంచి 45 స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తున్నది. జాతీయ పార్టీ స్టేటస్‌ను ఎన్పీసీ కోల్పోయింది. అలాగే గోవా, మణిపూర్, మేఘాలయలో ‘స్టేట్ పార్టీ’ హోదాను కూడా ఆ పార్టీ కోల్పోయింది. ఈ నేపథ్యంలో తిరిగి జాతీయ, స్టేట్ పార్టీ హోదాను దక్కించుకునేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ తెలిపారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం ఈసీ తమకు అలారమ్ సింబల్‌ను కేటాయించినట్లు చెప్పారు.
కాగా, మరాఠీ జనాభా అధికంగా ఉన్న మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని ఎన్సీపీ భావిస్తున్నది. అలాగే మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని యోచిస్తున్నది. కర్ణాటకలో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొన్నది. తాజాగా ఎన్సీపీ రంగంలోకి దిగడంతో కాంగ్రెస్ ఓట్లను ప్రభావితం చేయవచ్చని తెలుస్తున్నది.
మరోవైపు వచ్చే ఏడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీల ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆ పార్టీ నేత రాహుల్ గాంధీతో శరద్ పవార్ సమావేశమయ్యారు. బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి రావాలన్న అంశంపై వారితో చర్చించారు. అయితే ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగాలని ఎన్సీపీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల ఐక్యత ఏ మేరకు ఫలిస్తుందో అన్నదానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: