బెంగళూరు: కర్ణాటకలోని జనతాదళ్ సెక్యులర్- జేడీ(ఎస్) పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసేందుకు ఇటీవల ఎన్డీఏ కూటమిలో చేరింది. ఈ నేపథ్యంలో సీనియర్ ముస్లిం నేత జేడీ(ఎస్)కు రాజీనామా చేశారు. ( Muslim leader quits JD(S) ) కర్ణాటకలో ఆ పార్టీ ఉపాధ్యక్షుడైన సయ్యద్ షఫీవుల్లా జేడీ(ఎస్)ను వీడారు. వర్గాలు, కులాల మధ్య చీలికలు తెచ్చే పార్టీ (బీజేపీ)లో జేడీ(ఎస్) చేరిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జేడీ(ఎస్)లో తాను కొనసాగడం చాలా కష్టమని అన్నారు. ‘గత 30 ఏళ్లుగా పార్టీ(జేడీఎస్)తోనే ఉన్నా. మా పార్టీ సెక్యులర్ అన్న భావన ఉంది. ఇప్పుడు నా పార్టీ వర్గాలు, కులాల మధ్య చీలికలు సృష్టించే, మతపరమైన ఎజెండాను ప్రచారం చేసే పార్టీ(బీజేపీ)తో చేతులు కలిపారు. సెక్యులర్ నాయకులమైన మేం దానిని వ్యతిరేకిస్తున్నాం’ అని ఆయన అన్నారు.
కాగా, కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు నెలకొన్న సమస్యలను సయ్యద్ షఫీవుల్లా ఎత్తి చూపారు. దేశం అభివృద్ధి చెందాల్సిన మార్గం అది కాదని తెలిపారు. ప్రజల మధ్య చిచ్చు పెట్టే బీజేపీతో లౌకిక శక్తులు ఏకీభవించడం లేదని చెప్పారు. దేశంలో విద్వేషాన్ని ప్రచారం చేసే పార్టీతో పొత్తు కలిగి ఉండటం తన లాంటి వ్యక్తులు సర్దుబాటు చేసుకోవడం కష్టమని అన్నారు.