న్యూఢిల్లీ: ద వైర్ మీడియా సంస్థకు చెందిన సీనియర్ జర్నలిస్టులు సిద్ధార్ధ వరదరాజన్, కరణ్ థాపర్‌పై అస్సాంలో దేశద్రోహం కేసు నమోదు అయ్యింది. క్రైం బ్రాంచ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం పట్ల జర్నలిస్టు సంఘాలు విస్మయం వ్యక్తం చేశాయి. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 152 కింద ఆ జర్నలిస్టులపై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా, ఇండియన్ వుమెన్ ప్రెస్ కార్ప్స్ సంఘాలు ఆ ఎఫ్ఐఆర్ పట్ల విముఖత వ్యక్తం చేశాయి.
తమ మీడియా జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం రెండు నెలల్లో రెండోసారి అని ద వైర్ సంస్థ పేర్కొన్నది. గౌహతికి చెందిన క్రైం బ్రాంచ్ పోలీసులు ప్రతీకార చర్యగా జర్నలిస్టులపై కేసు పెట్టినట్లు జర్నలిస్టు సంఘాలు ఆరోపించాయి. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తేదీ ఆ సమన్లలో లేదు. ఎటువంటి నేరానికి పాల్పడ్డారో కూడా ఆ ఎఫ్ఐఆర్లో చెప్పలేదు. ఆగస్టు 14వ తేదీన ద వైర్ ఆఫీసుకు సమన్లు అందినట్లు తెలుస్తోంది. అయితే ఆగస్టు 18వ తేదీన కూడా ఇదే రకరమైన సమన్లు థాపర్ పేరిట వచ్చాయి.
ఆగస్టు 22వ తేదీన గౌహతిలోని పాన్‌బజార్ క్రైం బ్రాంచ్ స్టేషన్‌కు రావాలని పేర్కొన్నారు. ఒకవేళ రాకుంటే అరెస్టు చేసే అవకాశాలు ఉన్నట్లు ఆ నోటీసులో తెలిపారు. పాకిస్థాన్‌తో జరిగిన పోరులో భారతీయ వైమానిక దళం యుద్ధ విమానాలు కోల్పోయిన అంశంపై రాసిన కథనం విషయంలో జర్నలిస్టు వరదరాజన్‌పై కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది.