పూరి: ఒడిశాలోని పూరి జగన్నాథ్ ఆలయాన్ని(Puri Jagannath Temple) పేల్చివేస్తామని మంగళవారం సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆలయ పరిసరాల్లో ఇవాళ భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆన్లైన్ పోస్టు ఆధారంగా ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఫేస్బుక్లో ఆ పోస్టు కనిపించింది. ఆలయాన్ని పేల్చడంతో పాటు బీజేడీ రాజ్యసభ ఎంపీ సుభాషిస్ కుంతియాను అటాక్ చేస్తామని కూడా ఆ పోస్టులో హెచ్చరించారు. షాపింగ్ కాంప్లెక్స్‌ను కూడా పేల్చివేస్తామన్నారు.
అయితే ఆ సోషల్ మీడియా పోస్టు కోసం ఓ మహిళ అకౌంట్‌ను వాడుకున్నారు. ఆమె పేరుతో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ యూజర్ ఐడీని క్రియేట్ చేసి భయభ్రాంతులకు గురిచేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. పూరి సైబర్ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేశారు. బాంబు బెదిరింపు నేపథ్యంలో జగన్నాథుడి ఆలయ పరిసరాల చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
పూరి ఎస్పీతో మాట్లాడినట్లు ఎంపీ కుంతియా పేర్కొన్నారు. తనకు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ వచ్చినట్లు కూడా ఆ ఎంపీ తెలిపారు.