న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్పోర్ట్ ( Delhi Airport )లో భద్రతను భారీగా పెంచారు. ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా నుంచి ఢిల్లీ పోలీసులకు ఓ బాంబు బెదిరింపు ఈమెయిల్ రావడంతో పోలీసులు హైఅలెర్ట్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఢిల్లీ ఎయిర్‌ఫోర్ట్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. అల్‌ఖైదా ఎయిర్‌పోర్ట్‌లో బాంబు పేలుడుకు ప్రణాళిక రచిస్తోందంటూ వచ్చిన ఈమెయిల్ గురించి ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ శనివారం ఎయిర్‌లైన్ ఆపరేషన్స్ కంట్రోల్ సెంటర్‌కు సమాచారం ఇచ్చింది.
సింగపూర్ నుంచి కరణ్‌బీర్ సూరి అలియాస్ మహ్మద్ జలాల్, అతని భార్య షైలీ శారదా అలియాస్ హసీనా ఆదివారం ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్నారని, వీళ్లు 1-3 రోజుల్లో ఎయిర్‌పోర్ట్‌లో పేలుడు ప్లాన్ చేస్తున్నారని సమాచారం వచ్చినట్లు ఆ ప్రకటనలో ఎయిర్పోర్ట్ వెల్లడించింది. దీంతో ఎయిర్‌పోర్ట్‌లో అదనపు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. వీళ్ల పేర్లతోనే ఈ మధ్యే మరో బెదిరింపు సందేశం కూడా అందినట్లు ఎయిర్పోర్ట్ బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ చెప్పింది.