న్యూఢిల్లీ: ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో.. ఆ అంశంలోకి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నేరుగా ప్రవేశించారని, ఆయనే స్వయంగా జోక్యం చేసుకుని రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకునేలా చేశారని విదేశాంగ శాఖ మంత్రి మార్కో రూబియో(Marco Rubio) తెలిపారు. ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఇటీవల ఇండో, పాక్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సమయంలో..ఆ ఉద్రిక్తతలకు తానే బ్రేక్ వేసినట్లు ట్రంప్ పదేపదే వెల్లడించిన విషయం తెలిసిందే. ట్రంప్ వ్యాఖ్యలను సమర్థిస్తూ అమెరికా మంత్రి రూబియో కూడా మాట్లాడారు. శాంతి స్థాపనకు ట్రంప్ పట్టుదలతో ఉన్నారని, ఇండో, పాక్ యుద్ధ వాతావరణంలోకి తాము నేరుగా జోక్యం చేసుకున్నామని, శాంతి ఏర్పడే విధంగా ట్రంప్ ప్రయత్నాలు చేసినట్లు రూబియో వెల్లడించారు.
ఇండియా, పాకిస్థాన్ మధ్య ఉన్న ఉద్రిక్తతలు తగ్గే రీతిలో చర్యలు చేపట్టినట్లు ట్రంప్ మే 10వ తేదీ నుంచి పదేపదే చెప్పారు. ఒకవేళ ఆ రెండు దేశాలు యుద్ధాన్ని ఆపితే అప్పుడు వాటితో తాము గరిష్ట స్థాయిలో వాణిజ్యం చేయనున్నట్లు తెలిపారు. కానీ పాకిస్థాన్‌తో నిర్వహించిన డీజీఎంవో సైనిక చర్చల తర్వాతే రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు బ్రేక్ పడినట్లు ఇండియా చెబుతున్న విషయం తెలిసిందే.
యుద్ధ సంక్షోభాల నుంచి అనేక దేశాలను ట్రంప్ రక్షించినట్లు రూబియో ఈ సందర్భంగా గుర్తు చేశారు. కంబోడియా-థాయిల్యాండ్, అజర్బైజాన్-అర్మేనియా, డీఆర్సీ కాంగో-రువాండలో ఉన్న సంక్షోభాలను ట్రంప్ పరిష్కరించినట్లు రూబియో చెప్పారు.