బెంగళూరు: చట్టబద్ధంగా చెల్లుబాటు కాని రెండో వివాహం చేసుకున్న ఓ జంట విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. సెక్షన్ 498ఏ కేసులో భర్త(46)కు కింది కోర్టు వేసిన శిక్షను కొట్టేసింది. అతడు చేసుకున్న రెండో వివాహమే చెల్లుబాటు కానప్పుడు..అతడి రెండో భార్య చేసే ఫిర్యాదు..సెక్షన్ 498ఏ కిందకు రాదని హైకోర్టు ధర్మాసనం పేర్కొన్నది. తుమకూరు జిల్లాకు చెందిన కాంతరాజు తనను వేధింపులకు గురిచేస్తున్నాడని, అతడి రెండో భార్య ఫిర్యాదు చేయగా..పోలీసులు సెక్షన్ 498ఏ కేసు నమోదుచేశారు. 2019లో తుమకూరు ట్రయల్ కోర్టు కాంతరాజును దోషిగా తేల్చింది. సెషన్స్ కోర్టులో శిక్ష ఖరారైంది. ఈ తీర్పును సవాల్ చేస్తూ కాంతరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశాడు. దీనిపై హైకోర్టు విచారణ జరపగా, తమది చట్టబద్ధంగా జరిగిన వివాహమని రెండో భార్య సాక్ష్యాలు చూపలేకపోయింది. దీంతో ఇక్కడ ఆమెకు సెక్షన్ 498ఏ వర్తించదని హైకోర్టు ధర్మాసనం తేల్చిచెప్పింది.