న్యూఢిల్లీ, నవంబర్ 18: దురాక్రమణ కాంక్షతో బుసలు కొడుతున్న డ్రాగన్ మరింతగా రెచ్చిపోయింది. గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దుల్లో గ్రామాలను నిర్మిస్తూనే ఉన్నది. మెక్‌మోహన్ రేఖకు దిగువన.. అరుణాచల్‌లోని అప్పర్ సుబాన్సిరిలో వంద ఇండ్లతో చైనా ఓ గ్రామాన్ని నిర్మించిందని అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ఇటీవల ఓ నివేదికలో వెల్లడించడం తెలిసిందే. తాజాగా భారత భూభాగంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మరో గ్రామాన్ని నిర్మించినట్టు ఇంగ్లిష్ న్యూస్ వెబ్సైట్ ‘ఎన్డీటీవీ’ సంచలన కథనాన్ని వెలువరించింది.
2019, మార్చి 19న తీసిన ఉపగ్రహ చిత్రాల్లో ఈ గ్రామం ఆనవాళ్లు లేవు. అయితే, ఈ ఏడాది సెప్టెంబర్ 20న తీసిన ఫొటోల్లో ఈ గ్రామం కనిపించింది. ఉపగ్రహ ఛాయా చిత్రాలను తీసే ప్రఖ్యాత సంస్థలు మ్యాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ల్యాబ్స్ తీసిన శాటిలైట్ ఫొటోల ద్వారా వీటిని ధ్రువీకరించారు.
వాస్తవాధీనరేఖ (ఎల్ఏసీ), అంతర్జాతీయ సరిహద్దు మధ్యలో అరుణాచల్‌ప్రదేశ్‌లోని షి-యోమి జిల్లాలో ఈ కొత్త గ్రామాన్ని చైనా నిర్మించింది.
డజన్ల కొద్దీ ఇండ్లు, భవనాలు నిర్మించారు. ఒక భవనం పైకప్పు మీద చైనా జాతీయ జెండాను పెయింట్‌గా వేశారు. గ్రామం ఉన్న ప్రాంతం చైనా పరిధిలోనిదే అని నమ్మించడానికి ఇలా చేశారు.
చైనా కొత్త గ్రామాన్ని నిర్మించడంపై ‘ఎన్డీటీవీ’ భారత సైనిక వర్గాలను సంప్రదించింది. ‘గ్రామం నిర్మించినట్టు చెబుతున్న ఆ ప్రాంతం.. ఎల్ఏసీకి ఉత్తరం దిశగా చైనా భూభాగంలోనే ఉన్నది’ అని సైనిక వర్గాలు తెలిపినట్టు ఎన్డీటీవీ వెల్లడించింది. ఇదే అంశంపై అరుణాచల్ సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రిని సంప్రదించగా ఇంకా సమాధానం రాలేదని వివరించింది. కాగా, పెంటగాన్ రిపోర్ట్‌పై ఇటీవల స్పందించిన భారత సైనిక వర్గాలు.. చైనా నిర్మించినట్టు చెబుతున్న గ్రామం ఉన్న ప్రాంతం ఎప్పటినుంచో డ్రాగన్ ఆధీనంలోనే ఉన్నదని పేర్కొన్నాయి. 1959లో అస్సాం రైఫిల్స్ పోస్ట్‌ను ఆక్రమించుకున్న పీఎల్ఏ.. అక్కడ అనేక నిర్మాణాలను ఎప్పటినుంచో చేపట్టిందని వెల్లడించింది.
కొత్త గ్రామం నిర్మించినట్టు చెబుతున్న ప్రాంతం భారత్‌లోనే ఉన్నదని ‘భారత్మ్యాప్స్’లో స్పష్టంగా కనిపిస్తున్నట్టు ‘ఎన్డీటీవీ’ పేర్కొంది. సర్వే ఆఫ్ ఇండియా వెబ్సైట్ ప్రకారం.. చైనా నిర్మించినట్టు చెబుతున్న గ్రామం భారత భూభాగంలోనిదేనని ఐరోపాకు చెందిన చీఫ్ మిలిటరీ ఎనలిస్ట్ సిమ్ టాక్ తెలిపారు. జీఐఎస్ కూడా దీన్ని ధ్రువీకరిస్తున్నదన్నారు. దేశ రక్షణకు కీలకమైన బ్రహ్మపుత్ర లోయకు త్వరగా చేరుకోవడానికి ఈ గ్రామం నిర్మించిన ప్రాంతం చాలా ముఖ్యమైనది. అందుకే, చైనా అక్కడ ఏకపక్షంగా నిర్మాణాన్ని చేపట్టినట్టు అభిప్రాయపడ్డారు.
భూటాన్‌లో చైనా ఏకంగా నాలుగు గ్రామాలను నిర్మించింది. 2020 మే – 2021 నవంబర్ మధ్య డోక్లాం సమీపంలో చైనా మిలిటరీ ఈ నిర్మాణ పనులు చేపట్టిందని ఉపగ్రహ చిత్రాలను విశ్లేషించే ‘డెట్రెస్ఫా’ ట్వీట్ చేసింది. అందుకు సంబంధించిన చిత్రాలను కూడా జతచేసింది. ఈ గ్రామాలు 100 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించినట్టు పేర్కొన్నది. ఈ గ్రామాల నిర్మాణం రెండు దేశాల మధ్య ఒప్పందానికి సంకేతమా? లేక చైనా విస్తరణవాదంలో మరో అంశమా? అని ప్రశ్నించింది.
డోక్లాం సమీపంలో చైనా 4 గ్రామాలను నిర్మించినా ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో కేంద్రం వైఖరిని ఎండగట్టింది. మోదీ జవాబు చెప్పాలని డిమాండ్ చేసింది.