న్యూఢిల్లీ : పాక్‌కు గూఢచార్యం చేస్తూ పట్టుబడిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా విషయంలో రోజురోజుకూ ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఆమెపై స్కాటిష్ యూట్యూబర్ కల్లమ్ మిల్ సంచలన విషయం వెల్లడించారు. పాకిస్థాన్‌లోని లాహోర్ అనార్కలీ బజార్లో ఆమె వెంట ఏకే 47లను కలిగిన ఆరుగురు గన్మెన్లను చూసినట్టు చెప్పాడు. పాకిస్థాన్ ఇంటెలిజన్స్‌తో ఆమె సాన్నిహిత్యంగా ఉంటున్నట్టు గుర్తించిన హర్యానా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా విధించిన నాలుగు రోజుల కస్టడీ ముగియడంతో, న్యాయస్థానంలో హాజరపరిచారు.
సోమవారం ఆమెను మరో 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి కోర్టు అప్పగించింది. కాగా స్కాటిష్ యూట్యూబర్ విడుదల చేసిన తాజా వీడియోలో ఆయన పాకిస్థాన్‌లోని అనార్కలి బజార్లో జ్యోతి మల్హోత్రాతో మాట్లాడుతున్నారు. ఇందులో ఆమె ‘మొదటిసారి పాకిస్థాన్ వచ్చారా’ అంటూ కల్లమ్‌ను ప్రశ్నిస్తున్నది. ‘లేదు.. ఇది ఐదోసారి’ అంటూ ఆయన సమాధానమిచ్చారు. తాను ఇండియన్‌ను అంటూ ఆమె పరిచయం చేసుకుంది. అయితే పాకిస్థాన్ ఆతిథ్యం గురించి జ్యోతిని కల్లమ్ ప్రశ్నించగా గొప్పగా ఉందంటూ ఆమె సమాధానమిచ్చింది. అయితే ఆమె వెంట ఆరుగురు సాయుధులైన పోలీసులు ఉండడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన చెప్పుకొచ్చాడు.