న్యూఢిల్లీ: పని ప్రదేశంలో సీనియర్లు జూనియర్లకు చీవాట్లు పెట్టడాన్ని ‘ఉద్దేశపూర్వక అవమానం’గా పరిగణించలేమని.. అందుకు క్రిమినల్ చర్యలు అవసరం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి సందర్భాల్లో క్రిమినల్ అభియోగాలకు అనుమతిస్తే వినాశకర పరిణామాలకు దారి తీయొచ్చని, ఆఫీసులో అవసరమైన క్రమశిక్షణ వాతావరణాన్ని దెబ్బ తీస్తుందని కోర్ట్ పేర్కొంది.
మేధో వైకల్య వ్యక్తుల సాధికారత కోసం పనిచేసే జాతీయ సంస్థ డైరెక్టర్ 2022లో ఒక సహాయ ఆచార్యుడిని అవమానించారని దాఖలైన కేసును విచారించిన సందర్భంగా ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. డైరెక్టర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకు ఇతర ఉద్యోగుల ముందు ఆయన తనను దూషించి, మందలించారని ఫిర్యాదీదారు పేర్కొన్నారు. అయితే దాన్ని రెచ్చగొట్టే ఉద్దేశంతో చేసిన అవమానంగా పేర్కొనలేమని కోర్టు తెలిపింది.