న్యూఢిల్లీ: చొక్కా జేబులోంచి డబ్బులు దొంగిలించిన కుమారుడ్ని తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన 14 ఏళ్ల బాలుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు. (Boy Burns Father Alive) బాలుడు ఆ ఇంటి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్‌కు చెందిన 55 ఏళ్ల మహ్మద్ అలీమ్ భార్య కొన్నేళ్ల కింద చనిపోయింది. పెళ్లైన నలుగురు సంతానం విడివిడిగా నివసిస్తున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో 14 ఏళ్ల కుమారుడితో కలిసి ఢిల్లీకి చేరుకున్నాడు. ఫరీదాబాద్‌లోని అజయ్ నగర్ పార్ట్ 2 ప్రాంతంలో అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు.
కాగా, ఫిబ్రవరి 18న తెల్లవారుజామున చొక్కా జేబులోని డబ్బులను కుమారుడు చోరీ చేయడాన్ని అలీమ్ చూశాడు. దీంతో అతడ్ని మందలించాడు. ఆగ్రహించిన ఆ బాలుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అతడి అరుపులు విన్న ఇంటి యజమాని రియాజుద్దీన్, పొరుగు వ్యక్తితో కలిసి డాబా మీదకు వెళ్లాడు. బయట నుంచి తలుపు మూసి ఉన్న అద్దె ఇంట్లో మంటలను అతడు గమనించాడు. డోర్ తీయగానే మంటల్లో కాలిన అలీమ్ అక్కడికక్కడే మరణించాడు. 14 ఏళ్ల బాలుడు పక్కనే ఉన్న ఇళ్ల మీదకు దూకి పారిపోయాడు.
మరోవైపు ఇంటి యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. అలీమ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పారిపోయిన బాలుడ్ని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. తండ్రిని హత్య చేయడంపై అతడ్ని ప్రశ్నిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. మృతుడు అలీమ్ మతపరమైన ప్రదేశాలకు విరాళాలు సేకరించేవాడని చెప్పారు. వారపు మార్కెట్లలో దోమతెరలు, ఇతర వస్తువులు అమ్మేవాడని వెల్లడించారు.