Diabetes | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న రోగులకు శుభవార్త. ఈ తరహా మధుమేహంతో బాధపడుతున్న ఓ మహిళకు రీప్రోగ్రామింగ్ టెక్నిక్ సాయంతో చైనా పరిశోధకులు ఆ వ్యాధిని పూర్తిగా నయం చేశారు. రోగి శరీరంలోని కొవ్వు కణాలను ఇన్సులిన్ ఉత్పత్తి చేసే పాంక్రియాటిక్ కణాలుగా (ఐస్లెట్ కణాలు) మార్చడం ద్వారా టైప్-1 డయాబెటిస్‌కు చెక్ పెట్టినట్టు పరిశోధకులు పేర్కొన్నారు. ఈ మేరకు ఆ వివరాలను జర్నల్ ‘సెల్’ ప్రచురించింది. ప్రస్తుతం టైప్-1 డయాబెటిస్ నుంచి సదరు మహిళ పూర్తిగా కోలుకొన్నదని, ఈ తరహా చికిత్స కోసం మరికొంతమంది రోగులు తమ దగ్గర పేర్లు నమోదు చేసుకొంటున్నట్టు పరిశోధకులు పేర్కొన్నారు.
తొలుత రోగి శరీరంలోని కొవ్వు కణాల్లోకి కొన్ని ప్రత్యేక రసాయనాలను పంపించి ప్లూరిపోటెంట్ అనే మూల కణాలుగా (రీప్రొగ్రామింగ్ టెక్నిక్) వాటిని మార్చారు. అంటే తొలుత కొవ్వు కణాలుగా ఉండే ఆ సెల్స్ తాజా ప్రక్రియతో ఏ రకమైనా కణాలుగానైనా రూపాంతం చెందగలవన్న మాట. అనంతరం ఈ కణాలను ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే ఐస్లెట్ సెల్స్‌గా పరిశోధకులు మార్చారు. అనంతరం మహిళ శరీరంలోకి వాటిని ప్రవేశపెట్టారు. అలా వ్యాధికి చెక్ పెట్టారు. కాగా, శరీరంలోని రోగనిరోధక శక్తి.. ఐస్లెట్ కణాలను నాశనం చేయడంతో ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో టైప్-1 డయాబెటిస్ వస్తుంది.