భోపాల్: విద్యార్థి మరణించినట్లు చెప్పి ఒక ఉపాధ్యాయుడు సెలవు తీసుకున్నాడు. (Teacher Falsely Cites Student’s Death) ఆ బాలుడి అంత్యక్రియలకు వెళ్తున్నట్లు రిజిస్టర్లో పేర్కొన్నాడు. ఈ విషయం ఆ విద్యార్థి తండ్రి దృష్టికి వెళ్లింది. దీంతో షాక్ అయిన ఆయన జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్‌లోని మౌగంజ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిగ్రిక తోలాలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా హీరాలాల్ పటేల్ పని చేస్తున్నాడు. నవంబర్ 27న ఆయన సెలవు తీసుకున్నాడు. స్కూల్లో 3వ తరగతి చదువుతున్న విద్యార్థి చనిపోయాడని, ఆ బాలుడి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు వెళ్తున్నట్లు హాజరు రిజిస్టర్లో పేర్కొన్నాడు.
కాగా, ఆ విద్యార్థి తండ్రికి ఈ విషయం తెలిసింది. బతికున్న తన కుమారుడు మరణించినట్లుగా టీచర్ పేర్కొని సెలవు తీసుకున్నట్లు తెలిసి షాక్ అయ్యాడు. ఉపాధ్యాయుడు హీరాలాల్ పటేల్‌పై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఆ టీచర్‌ను సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు కలెక్టర్ ఆదేశించారు.