లక్నో: ఒక విద్యార్థి పెన్ను దొంగిలించినట్లు స్కూల్ సిబ్బంది ఆరోపించారు. ఆ బాలుడ్ని వారు వేధిస్తుండటంతో అతడు భరించలేకపోయాడు. కుమారుడి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్కూల్ వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. (Harassing Student Over Pen Theft) ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. ఒక ప్రైవేట్ స్కూల్లో 8 ఏళ్ల బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. నవంబర్ 28న ఒక స్టూడెంట్ పెన్ను చోరీ అయ్యింది. అయితే ఆ బాలుడు దొంగిలించినట్లు స్కూల్ సిబ్బంది ఆరోపించారు. డిసెంబర్ 12న ప్రిన్సిపాల్ రూమ్‌కు అతడ్ని పిలిపించారు. పెన్ను దొంగిలించినట్లు ఆ విద్యార్థితో బలవంతంగా ఒప్పించి వీడియో రికార్డ్ చేశారు. చోరీ అయిన పెన్ను ధర చెల్లించాలని బాలుడి పేరెంట్స్‌ను ఒత్తిడి చేశారు.
కాగా, పెన్ను చోరీ జరిగిన రోజున తమ కుమారుడు స్కూల్‌కు వెళ్లలేదని తల్లిదండ్రులు తెలిపారు. ఆ తప్పు చేసినట్లుగా బలవంతంగా ఒప్పించి రికార్డ్ చేశారని ఆరోపించారు. నాటి నుంచి స్కూల్ సిబ్బంది తమ కుమారుడ్ని వేధిస్తున్నారని విమర్శించారు. రాత్రివేళ నిద్ర లేచి ఏడుస్తున్నాడని, ‘మేడం నేను పెన్ను తీయలేదు’ అని కలవరిస్తున్నాడని తెలిపారు. బుక్స్‌తో పాటు గోడలపై ‘హెల్ప్’ అని రాయడాన్ని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మరోవైపు బాలుడి తల్లి ఫిర్యాదుపై పోలీసులు స్పందించారు. ఆ స్కూల్‌కు నోటీస్ జారీ చేశారు. అయితే పోలీస్ స్టేషన్‌కు హాజరుకాలేదని పోలీస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 23న స్కూల్ డైరెక్టర్ దేవరాజ్ సింగ్ రాజవత్, ప్రిన్సిపాల్ అనుప్రీత్ రావల్, టీచర్లు సంగీతా మాలిక్, స్వతంత్ర అగ్నిహోత్రిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
Also Read:
Protest Outside Delhi High Court | కుల్దీప్ సెంగర్‌కు బెయిల్‌పై.. ఢిల్లీ హైకోర్టు ముందు నిరసన
Watch: రైలులో కాలేజీ అమ్మాయి పట్ల కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన.. తర్వాత ఏం జరిగిందంటే?