Government School | భోపాల్: ఇష్టారీతిన, మొండిగా ప్రవర్తిస్తున్న విద్యార్థిని మందలించిన ప్రిన్సిపాల్ దారుణ హత్యకు గురయ్యారు. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ జిల్లాలో ఉన్న ధమోరా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఈ దారుణం జరిగింది. పోలీసు ఇన్స్పెక్టర్ పుష్పేంద్ర యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, పన్నెండో తరగతి చదువుతున్న విద్యార్థి (17) ప్రవర్తన సరిగా లేకపోవడంతో ప్రిన్సిపాల్ ఎస్కే సక్సేనా (55) గతంలో మందలించారు.
తీవ్ర ఆగ్రహానికి గురైన ఆ విద్యార్థి శుక్రవారం పాఠశాలకు గైర్హాజరయ్యాడు. కానీ ప్రిన్సిపాల్ కదలికలను గమనిస్తూ, ఆ పాఠశాల వద్ద దేశవాళీ తుపాకీతో ఆయన తలపై కాల్పులు జరిపాడు. ఆయన అక్కడికక్కడే కుప్పకూలి, ప్రాణాలు కోల్పోయారు. ఆయన స్కూటర్‌పైనే నిందితుడు పారిపోయాడు. ఉత్తరప్రదేశ్ సరిహద్దుల్లో ఆ మైనర్ విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు.