న్యూఢిల్లీ, జనవరి 17: గుజరాత్లో విద్యార్థులు మధ్యలోనే చదువులు మానేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఏమిటి సంబంధం? భారతీయ వస్తువులపై ట్రంప్ విధించిన 50 శాతం ప్రతీకార సుంకాలతో గుజరాత్ జీవనాడిగా భావించే వజ్రాల పరిశ్రమ మెరుపులు తగ్గడమేగాక అవి పాఠశాల తరగతి గదులపై కూడా ప్రభావం చూపాయి. ఉద్యోగాలు కోల్పోయి, వేతనాలు తగ్గిపోయిన లక్షలాదిమంది వజ్ర పరిశ్రమ కార్మికులు తమ పిల్లల చదవులకు మంగళం పాడారు.
ట్రంప్ విధించిన 50 శాతం సుంకాల ప్రభావం భారత్‌లో వజ్రాల నగరంగా పేరుగాంచిన సూరత్‌పై తీవ్రంగా ప్రభావం చూపించింది. 2025 విద్యా సంవత్సరం మధ్యలోనే లక్షలాది మంది పిల్లలు తమ చదువులను అర్ధాంతరంగా నిలిపివేశారు. పారిశ్రామిక హబ్‌గా, దేశంలోనే అత్యంత ప్రగతిశీల రాష్ట్రంగా పేరుగాంచిన గుజరాత్లో స్కూల్ డ్రాపౌట్ల పరిస్థితిని శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన నివేదిక వెల్లడించింది. స్కూల్ డ్రాపౌట్లపై రాష్ర్టాల వారీగా ప్రభుత్వం అందచేసిన వివరాలు గుజరాత్లో నెలకొన్న పరిస్థితికి అద్దం పట్టాయి.
2024-25లో గుజరాత్లో స్కూల్ డ్రాపౌట్ల సంఖ్య 54,541 ఉండగా 2025-26లో అది 341 శాతం పెరిగి 2.4 లక్షలకు చేరుకోవడం ఆందోళనకరం. సూరత్‌లోని 24 మున్సిపల్ కార్పొరేషన్ స్కూళ్లలో 600 మందికి పైగా విద్యార్థులు చదువులను అర్ధాంతరంగా మానేసినట్టు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. 2025 జూలైలో ట్రంప్ విధించిన 25 శాతం ప్రతీకార సుంకాలు అమలులోకి రాగా ఆగస్టులో మరో 25 శాతం సుంకాలు అమలులోకి వచ్చాయి. భారత్ నుంచి కట్, పాలిష్ చేసిన వజ్రాలకు అమెరికా అతిపెద్ద మార్కెట్ (40 శాతం)గా ఉంది.
సుంకాల ప్రభావంతో అనేక వజ్రాల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. ఫ్యాక్టరీలు వేల మంది కార్మికులను తొలగించడం, జీతాలు తగ్గించడం వంటి చర్యలకు పాల్పడ్డాయి. ఆదాయాలు తగ్గిపోవడంతో కార్మికులకు తమ పిల్లల ప్రైవేట్ స్కూళ్ల ఫీజులు మోయలేని భారంగా మారాయి. దీంతో పిల్లల చదువు మధ్యలోనే ముగిసిపోయింది. 2025 సంవత్సరం రెండో భాగంలోనే అధిక సంఖ్యలో డ్రాపౌట్లు సంభవించడం, ట్రంప్ సుంకాలు కూడా అదే సమయంలో అమలులోకి రావడం గమనార్హం. నెలకు రూ. 30,000-35,000 ఆదాయం పొందే కార్మికుల జీతాలు రూ. 20,000-22,000కు పడిపోయాయని ప్రభుత్వ ప్రాయోజిత ఇండియన్ డైమండ్ ఇన్స్టిట్యూట్ చైర్పర్సన్ దినేష్ నవాదియా తెలిపారు. ఈ తగ్గింపు నేరుగా కార్మికుల పిల్లల చదువులు, వైద్య ఖర్చులు, రోజువారీ ఖర్చులపై ప్రత్యక్ష ప్రభావం చూపినట్టు ఆయన చెప్పారు. కార్మికులు తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ స్కూళ్లకు మార్చాల్సిన అనివార్యత ఏర్పడినట్టు వివరించారు.