Bihar | పాట్నా, జనవరి 13: విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండి పెట్టేందుకు తరగతి గదిలో వారు కూర్చునే బెంచీలనే వంట చెరకుగా మార్చేశారు. బీహార్‌లోని పాట్నా జిల్లా బిహ్టా బ్లాక్‌లోని అప్‌గ్రేడెడ్ మిడిల్ స్కూల్లో ఈ ఘటన జరిగింది. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో విద్యాశాఖ దర్యాప్తునకు ఆదేశించింది.
మధ్యాహ్న భోజనం వండేందుకు కలప లేకపోవడంతో టీచర్ సవితా కుమారి బెంచీలను ఉపయోగించుకోమని చెప్పిందని, ఆ తర్వాత ఆమే వీడియో తీసి వైరల్ చేశారని వంట మనిషి ఆరోపించారు. ఈ ఆరోపణలను సవిత ఖండించారు. తనను అప్రతిష్ఠపాలు చేసేందుకే తనపై నిందలు వేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంచీలను వంటచెరకుగా వాడుకోమని చెప్పింది తాను కాదని, స్కూలు ప్రిన్సిపాల్ అని ఆరోపించారు. ప్రిన్సిపాల్ మాత్రం దీనిని ‘మానవ తప్పిదం’గా కొట్టిపడేశారు.