Supreme court : ట్రిబ్యునళ్ల సంస్కరణల చట్టం-2021 (Tribunals Reforms Act-2021) ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక తీర్పు చెప్పింది. ఈ చట్టంలో నియామకాలు, సర్వీసు కండీషన్లు, పదవీకాలాలకు సంబంధించిన కొన్ని నిబంధనలను గతంలో సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసిందని, చిన్నచిన్న మార్పులతో కేంద్రం వాటిని మళ్లీ ప్రవేశపెట్టిందని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించింది.
చట్టంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు న్యాయవ్యవస్థ స్వాతంత్య్రానికి విఘాతం కలిగిస్తున్నాయని, అధికార వికేంద్రీకరణ సూత్రాలను ఉల్లంఘిస్తున్నాయని, అలాంటి వాటిని తిరిగి ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ చట్టాన్ని తాము సరిచూశామని, గతంలో కోర్టు రద్దు చేసిన నిబంధనలను స్వల్ప మార్పులతో మళ్లీ అమల్లోకి తెచ్చారని పేర్కొంది. ఇది రాజ్యాంగ విరుద్ధమే అవుతుందని స్పష్టంచేసింది.
ట్రిబ్యునళ్ల సభ్యుల పదవీకాలాలకు సంబంధించి గతంలో ఇచ్చిన న్యాయపరమైన ఆదేశాలను ఈ సందర్భంగా కోర్టు పునరుద్ధరించింది. ఆదాయపు పన్ను అప్పిలేట్ ట్రైబ్యునల్, కస్టమ్స్, ఎక్సైజ్, సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రైబ్యునల్ సభ్యులు 62 ఏళ్లు వచ్చేవరకు పదవిలో కొనసాగవచ్చని తెలిపింది. ఇక ట్రిబ్యునళ్ల ఛైర్పర్సన్లు/అధ్యక్షుల రిటైర్మెంట్ వయసు 65 ఏళ్ల వరకు ఉంటుందని వెల్లడించింది. అదే సమయంలో ఈ అంశంపై జాతీయ ట్రిబ్యునల్స్ కమిషన్ ఏర్పాటు చేయాలని సూచించింది.
2021లో తీసుకొచ్చిన ట్రైబ్యునళ్ల సంస్కరణల (హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనల) చట్టంతో ఫిల్మ్ సర్టిఫికేషన్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌తో సహా కొన్ని అప్పిలేట్ ట్రిబ్యునళ్లు రద్దయ్యాయి. వీటితోపాటు పలు ట్రిబ్యునళ్ల జ్యుడీషియల్, ఇతర సభ్యుల నియామక నిబంధనల్లో పలు సవరణలు జరిగాయి. అయితే, ఈ చట్ట నిబంధనలను సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మద్రాస్ బార్ అసోసియేషన్ సహా పలువురు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గతంలో విచారణ జరిపిన న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా తీర్పు వెలువరించింది.