న్యూఢిల్లీ, ఏప్రిల్ 15 : కాంగ్రెస్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భార్యపై తీవ్ర ఆరోపణలు చేసిన కేసులో తెలంగాణ హైకోర్టు అతనికి వారం రోజుల పాటు ఇచ్చిన ట్రాన్సిట్ ముందస్తు బెయిల్‌పై జస్టిస్ జేకే మహేశ్వరి, ఏఎస్ చందూర్కర్లతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం స్టే విధించింది. ఖేరాపై అస్సాంలో కేసు నమోదైతే ఆయన తెలంగాణ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం తెలిపారు. ‘నేరం అస్సాంలో జరిగింది.
ఎఫ్ఐఆర్ అస్సాంలో నమోదైంది. అలాంటప్పుడు తెలంగాణ హైకోర్టులో బెయిల్ ఎలా తెచ్చుకుంటారు’ అని ప్రశ్నించారు. ఖేరా తెలంగాణ హైకోర్టును ఎందుకు ఆశ్రయించారో తన వాదనలో తెలియజేయలేక పోయారని అన్నారు. కాగా, ఏప్రిల్ 5న జరిగిన ఒక మీడియా సమావేశంలో అస్సాం సీఎం భార్యకు పలు పాస్‌పోర్టులు ఉన్నాయని, ఆమెకు విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఖేరా ఆరోపించడంతో, తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆయనపై కేసు నమోదైంది.