న్యూఢిల్లీ: దేవాస్ మల్టీమీడియా కంపెనీని మూసివేయాలంటూ నేషనల్ కంపెనీ లా అపిలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ) ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం యాంత్రిక్స్ కార్పొరేషన్‌తో 2005లో దేవాస్ చేసుకొన్న ఒప్పందంలో భారీ అవకతవకలు జరిగాయని ధర్మాసనం పేర్కొంది. ఎన్సీఎల్ఏటీ ఆదేశాలను కొట్టివేయాలంటూ దేవాస్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి యోగ్యకరమైన అంశాలు కనిపించడంలేదని వ్యాఖ్యానించింది. రెండు ఉపగ్రహాల సాయంతో మొబైల్ ఫోన్లకు వీడియో, మల్టీమీడియా సర్వీసులు అందించే ఉద్దేశంతో యాంత్రిక్స్‌కు, దేవాస్‌కు మధ్య 2005లో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ఒప్పందంలో అవకతవకలు జరిగాయని, తప్పుడు సమాచారంతో దేవాస్ ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌విడ్త్‌ను కొనుగోలు చేసిందని ఆరోపణలు రావడంతో 2011లో ఈ ఒప్పందాన్ని రద్దు చేశారు. దేవాస్‌ను మూసేయాలని యాంత్రిక్స్ కార్పొరేషన్ కొత్త మేనేజ్మెంట్ ఎన్సీఎల్ఏటీలో పిటిషన్ వేసింది.
మేము పోరాడుతున్నాం: నిర్మల
యాంత్రిక్స్-దేవాస్ ఒప్పందం మోసపూరితమని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. యూపీఏ ప్రభుత్వం తప్పుడు పనులకు ఏ విధంగా పాల్పడిందో ఈ విషయం తెలియజేస్తున్నదన్నారు. సుప్రీం ఆదేశాల సాయంతో అంతర్జాతీయ వేదికలపై దేవాస్ వాదనలను సవాల్ చేస్తామన్నారు.
అమ్మాయిలకు 19 సీట్లే ఎందుకు? న్యూఢిల్లీ: నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) 2022 ప్రవేశాల్లో మహిళా అభ్యర్థుల స్థానాలను 19కి పరిమితం చేయడంపై వివరణ ఇవ్వాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు మంగళవారం ఆదేశించింది. తమ ఆదేశాలను ఖాతరు చేయకుండా.. గతేడాది స్థాయిలోనే సీట్లు ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియజేయాలని పేర్కొన్నది. అమ్మాయిలకు 19 సీట్లు అన్నది అప్పటికప్పుడు అనుకున్న సంఖ్య అని, ఎల్లకాలం అదే అమలు చేయాలని కాదని ధర్మాసనం స్పష్టం చేసింది.