న్యూఢిల్లీ: వక్షోజాలను పట్టుకోవడం, పైజమా తాడును తెంపడం వంటి చర్యలు అత్యాచారం నేరం కిందకు రావని అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన రూలింగ్‌పై కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పును తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఈ అంశంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలన్నారు. నాగరిక సమాజంలో ఇటువంటి తీర్పునకు చోటు లేదన్నారు. దీని ప్రభావం సమాజం మీద ప్రతికూలంగా పడుతుందన్నారు. దీనిపై మరింత ఎక్కువగా చర్చిస్తామని తెలిపారు. యూపీలోని కస్గంజ్లో 2021లో ఓ బాలిక తల్లితో కలిసి వెళ్తుండగా ఇద్దరు బాలికను ఓ వంతెన కిందకు లాక్కెళ్లారు. ఆమె అరవడంతో స్థానికులు ఆమెను కాపాడారు. ఈ కేసులో హైకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.