న్యూఢిల్లీ : ఓటరు నమోదు కోసం ఆధార్, ఎలక్టర్స్ ఫొటో ఐడెంటిటీ కార్డ్ (ఈపీఐసీ)లను నిర్ణయాత్మక గుర్తింపు రుజువులుగా ఎన్నికల కమిషన్ అనుమతించకపోవడంపై సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది. బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈసీని నిలదీసింది. ఆధార్‌ను ఎందుకు గుర్తింపు కార్డుగా పరిగణించడం లేదని, ఏ కార్డునైనా ఫోర్జరీ చేస్తారు కదా అని వ్యాఖ్యానించింది. విచారణ సందర్భంగా ఈసీ న్యాయవాది మాట్లాడుతూ.. దేశ పౌరసత్వానికి ఆధార్ గుర్తింపు కాదన్నారు.
రేషన్, ఆధార్ కార్డుల ఫోర్జరీ పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనిపై స్పందించిన ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ఆధార్, రేషన్ కార్డుతో పాటు స్వయంగా ఈసీ జారీచేసిన ఐడీ కార్డును ప్రాథమిక పత్రాలుగా పరిగణనలోకి తీసుకోవాలని ఈసీకి సూచించింది. ఓ వ్యక్తిని ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తే, ఆ వ్యక్తి చేయాల్సింది, ఈసీ చేసేదేమిటో తెలిపే టైమ్ షెడ్యూలును సమర్పించాలని ఈసీని ఆదేశించింది.