Brij bhushan | న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు ఉచ్చు బిగుస్తున్నది. లైంగిక వేధింపులకు గురైన ఏడుగురు రెజ్లర్లు ఫిర్యాదు చేసినప్పటికీ అతనిపై ఇంతవరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని దేశ అత్యున్నత న్యాయస్థానం ఢిల్లీ పోలీసులను ప్రశ్నించింది. జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న క్రీడాకారుల శిబిరాన్ని మంగళవారం పలువురు రాజకీయ నాయకులు, రైతు నేతలు, ఖాప్ పంచాయత్ కార్యకర్తలు సందర్శించి వారి పోరాటానికి సంఘీభావం తెలిపారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసేంతవరకూ ఇక ఆందోళన విరమించబోమని క్రీడాకారులు తేల్చి చెప్పారు. లైంగిక వేధింపుల ఘటనపై దర్యాప్తు జరిపిన ఓవర్‌సైట్ కమిటీ నివేదిక ఇచ్చి మూడు రోజులైనా దాని వివరాలు బయటపెట్టలేదని మండిపడ్డారు. బ్రిజ్ భూషణ్ ఫిర్యాదుదారులను బెదిరింపులకు గురిచేస్తున్నాడని, డబ్బులు ఎరచూపి లొంగదీసుకొనేందుకు ప్రయత్నిస్తున్నాడని రెజ్లర్లు వినేశ్ ఫోగట్, సాక్షి మాలిక్, బజ్రంగ్ పునియా ఆరోపించారు.
విచారణకు సుప్రీం అంగీకారం
రెజ్లర్ల ఆందోళనల విషయంలో సుప్రీంకోర్టు ఎంటరైంది. బ్రిజ్ భూషణ్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినా ఢిల్లీ పోలీసులు ఇప్పటి వరకు కేసు నమోదు చేయలేదంటూ ఏడుగురు మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు మంగళవారం అంగీకరించింది. ఢిల్లీ పోలీసులకు నోటీసులు జారీచేసిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించింది. దీనిపై సమాధానం చెప్పాలని పోలీసులను ఆదేశించింది. బ్రిజ్ భూషణ్‌పై క్రీడాకారులు చేస్తున్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని, వీటిని పరిగణనలోకి తీసుకొని సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని ధర్మాసనం ఈ సందర్భంగా పేర్కొన్నది. మహిళా రెజ్లర్లు వేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడుతామని తెలిపింది.
ఇది చట్ట ఉల్లంఘనే..
ఒక మైనర్‌తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై బ్రిజ్ భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదు చేసినా.. పోలీసులు కేసు నమోదు చేయకపోవడం దారుణమని, ఇది చట్టాన్ని ఉల్లంఘించడమేనని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ పేర్కొన్నారు. పిటిషనర్ల తరఫున ఆయన వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వం వేసిన కమిటీ నివేదికను కూడా బయటపెట్టలేదని, ఇటు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బీజేపీ ఎంపీ అయినందువల్లే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదని మరో న్యాయవాది నరేందర్ హూడా అన్నారు.
మహిళా రెజ్లర్ల ఐక్యత విచ్ఛిన్నానికి కుట్ర
ప్రముఖ రెజ్లర్ బజ్రంగ్ పునియా మంగళవారం సంచలన ఆరోపణలు చేశారు. బ్రిజ్‌భూషణ్‌పై ఫిర్యాదులను ఉపసంహరించుకోవాలని డబ్ల్యూఎఫ్ఐ ప్రతినిధులు మహిళా రెజ్లర్లను బెదిరిస్తున్నారని, డబ్బులు కూడా ఆఫర్ చేస్తున్నారని పేర్కొన్నారు. వారి ఇండ్లకు కూడా వెళ్తూ ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పునియా మీడియాతో మాట్లాడుతూ బ్రిజ్‌భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన ఏడుగురు మహిళా రెజ్లర్ల ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. వారి ప్రాణాలకు ముప్పు ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ, ఫిర్యాదుదారులైన మహిళా రెజ్లర్లకు ఏదైనా జరిగితే.. అందుకు కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ పోలీసులదే బాధ్యత అని పునియా పేర్కొన్నారు. బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేసే వరకూ ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేసిన మహిళా రెజ్లర్ల పేర్లను ఢిల్లీ పోలీసులు బ్రిజ్ భూషణ్‌కు లీక్ చేశారని వినేశ్ పోగట్ ఆరోపించారు.
పోరాటానికి పెరుగుతున్న మద్దతు
జంతర్‌మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న రెజ్లర్లకు పలు రాజకీయ పార్టీలు, మహిళా, రైతు, పౌర సంఘాలు సంఘీభావం పలుకుతున్నాయి. మంగళవారం హర్యానా మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా, కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్, సీపీఎం నేత బృందాకారత్ ధర్నాస్థలికి వచ్చి మద్దతు పలికారు. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతు సంఘాలకు చెందిన నేతలు కూడా రెజ్లర్లకు సంఘీభావంగా నిలిచారు. ఆందోళనలో భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) ప్రతినిధులు పాల్గొన్నారు.
ఎవరీ బ్రిజ్ భూషణ్?
Bhushan
బ్రిజ్ భూషణ్ ఉత్తరప్రదేశ్‌లోని కైసర్‌గంజ్ నుంచి బీజేపీ ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆరుసార్లు ఎంపీ అయిన బ్రిజ్‌భూషణ్‌పై అనేక ఆరోపణలు ఉన్నాయి. ఆయనపై పదుల సంఖ్యలో కేసులు నడుస్తున్నాయి. ప్రస్తుతం రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడిగా ఉన్నాడు. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లోనే.. చెరకు సహకార సంఘం ఎన్నికల నామినేషన్ల విషయంలో జిల్లా ఎస్పీకే తుపాకీ గురిపెట్టి, నోటికొచ్చినట్టు తిట్టాడని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఇంకా మాఫియా డాన్ దావూద్‌తో బ్రిజ్‌భూషణ్‌కు సంబంధాలున్నట్టు చెప్తున్నారు.