న్యూఢిల్లీ, జూన్ 19 : ఫుట్ పాత్ల మీద నడవడం ప్రాథమిక హక్కు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రోడ్డుపై వాహనాలు వెళ్లడం కంటే ఫుట్‌పాత్ మీద నడిచే హక్కుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ పీఎస్ నర్సింహా, ఏఎస్ చంద్రశేఖర్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది. దేశంలో ఎక్కడైనా స్వేచ్ఛగా నడిచే హక్కులో భాగంగా దీన్ని పరిగణించాలని.. ఆర్టికల్ 19(1)( డీ) కింద రాజ్యాంగ పరిరక్షణలోకి వస్తుందని ధర్మాసనం వెల్లడించింది. రోడ్డు ఉంటే అక్కడ కచ్చితంగా ఫుట్‌పాత్ ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టు ముందుకు ఓ రోడ్డు ప్రమాద నష్టపరిహార కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. ఐదేండ్ల బాలుడు తన తండ్రితో కలిసి పాఠశాలకు ఉదయం 9 గంటలకు వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ట్యాంకర్ లారీ ఢీకొట్టింది. దీంతో బాలుడు తీవ్ర గాయాలతో చనిపోయాడు. ఆ రోడ్డులో ఫుట్‌పాత్ లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో తండ్రికి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని రూ.11,44,628కి పెంచుతూ తీర్పు ఇచ్చింది. ఫుట్‌పాత్‌లపై నడిచే హక్కు ఉల్లంఘనకు గురైనప్పుడు మోటర్ యాక్ట్ 1988 ప్రకారం బాధితులు నష్టపరిహారం కోరవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.