న్యూఢిల్లీ, జనవరి 12: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై విచారణకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఇందూ మల్హోత్రా నేతృత్వంలో కమిటీని సుప్రీంకోర్టు నియమించింది. ఐదుగురు సభ్యులుండే ఈ కమిటీలో ఎన్ఐఏ డైరెక్టర్ జనరల్, చండీగఢ్ డీజీపీ, పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, పంజాబ్ శాంతిభద్రతల అదనపు డీజీపీ సభ్యులుగా ఉంటారని ప్రకటించింది. ప్రధాని పర్యటనకు చేసిన భద్రతా ఏర్పాటపై అన్ని డాక్యుమెంట్లను వెంటనే ఈ కమిటీకి అందజేయాలని పంజాబ్-హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. కాగా, ఈ కేసులో లాయర్లకు బెదిరింపు కాల్స్‌పైన కూడా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ బుధవారం కమిటీ హెడ్ ఇందూ మల్హోత్రకు లేఖ రాసింది.