Electoral Bonds | (స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): రాజకీయ పార్టీలకు నిధులు అందజేసేందుకు ఉద్దేశించిన ఎన్నికల బాండ్ల వివరాలను భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సర్వోన్నత ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు మంగళవారం ఈ డాటాను కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీ) నిర్ణీత గడువులోగా అందజేసినట్టు ఈ సందర్భంగా వెల్లడించింది. ఈ మేరకు ఎస్బీఐ చైర్మన్ దినేశ్ కుమార్ ఖారా న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు.
ఎస్బీఐ అఫిడవిట్‌లోని ప్రధానాంశాలు
ఏ పార్టీకి ఎన్ని వచ్చాయో తేలేది అప్పుడే..
ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి ఇచ్చినట్టు ఎస్బీఐ బుధవారం అఫిడవిట్‌ను సుప్రీంకోర్టుకు సమర్పించినప్పటికీ.. ఏ పార్టీకి ఎన్ని నిధులు దక్కాయన్నదానిపై స్పష్టతను ఇవ్వలేదు. అయితే, ఈసీకి ఇచ్చిన డాటాలో ఆ వివరాలను పొందుపరిచినట్టు కోర్టుకు తెలిపింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం.. ఈ నెల 15 సాయంత్రం 5 గంటల్లోగా ఈసీ ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని అధికారిక వెబ్సైట్లో బహిరంగపరచాల్సి ఉన్నది. అంటే శుక్రవారం సాయంత్రంలోగా ఏ పార్టీకి ఎన్ని నిధులు వచ్చాయి? ఎవరెవరు ఇచ్చారనే విషయాలు తెలియబోతున్నాయి. 2018 మార్చి నుంచి ఇప్పటివరకు 30 విడుతల్లో ఎస్బీఐ రూ.16,518 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లను విక్రయించింది. అత్యధిక విరాళాలు బీజేపీకే దక్కినట్టు నివేదికల సారాంశం.
గడువులోగా వెల్లడిస్తాం: ఈసీ
సుప్రీం ఆదేశాల మేరకు ఎన్నికల బాండ్లకు సంబంధించిన వివరాలను ఎస్బీఐ నిర్ణీత సమయానికే అందజేసినట్టు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) రాజీవ్ కుమార్ బుధవారం తెలిపారు. బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను కోర్టు ఇచ్చిన గడువులోగా బహిర్గతం చేస్తామని పేర్కొన్నారు. ‘బాండ్ల డాటాను ఎస్బీఐ నిర్ణీత సమయంలోనే (మార్చి 12న) ఈసీకి ఇచ్చింది. కోర్టు ఇచ్చిన గడువు తేదీని చూసి.. ఆలోపే బాండ్ల వివరాలను వెల్లడిస్తాం’ అని పేర్కొన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు ఈసీ సిద్ధంగా ఉన్నట్టు ఈ సందర్భంగా వెల్లడించారు.