Saurabh Bharadwaj : కులంపై బీజేపీ నేతల వ్యాఖ్యలను ఆప్ నేత, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ తప్పుపట్టారు. బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఇటీవల కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడటం కలకలం రేపిన విషయం తెలిసిందే. అనురాగ్ ఠాకూర్ జనరల్ క్యాటగిరీకి చెందిన వారని, కులం గురించి మాట్లాడే విషయంలో ఆయన సంయమనంతో వ్యవహరించాలని హితవు పలికారు. కొద్దిరోజుల కిందట బీజేపీ షాపులకు యజమానుల పేర్లు వెల్లడించే నేమ్ప్లేట్లు ఉండాలని డిమాండ్ చేసిందని, అప్పుడు కూడా తాము ఈ ప్రతిపాదనపై అభ్యంతరం తెలిపామని సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
భారత్లో పేరు కులాన్ని వెల్లడించేలా ఉంటుందని అందుకే తాము ఈ ప్రతిపాదనను వ్యతిరేకించామని చెప్పారు. ఏ ఒక్కరి కులం గురించి అడగడం తప్పని స్పష్టం చేశారు. మీరు అగ్ర కులానికి చెందిన (అనురాగ్ ఠాకూర్) వ్యక్తి కాబట్టి ఇది మీ అహంకారాన్ని సూచిస్తోందని అన్నారు. ఈ అహంకారాన్ని భారత్ సహించదని పేర్కొన్నారు. అనురాగ్ ఠాకూర్, బీజేపీ ఈ అహంకారానికి ఎన్నికల రాజకీయాల్లో భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ పేర్కొన్నారు.
కాగా తన కులం ఏంటో తెలియని వ్యక్తి కుల గణన గురించి మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీని ఉద్దేశించి లోక్సభలో బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. కులం గురించి మాట్లాడటం రాజ్యాంగ విరుద్ధమని, ఒకరి కులాన్ని గురించి ప్రశ్నించే హక్కు అనురాగ్ ఠాకూర్ సహా ఏ ఒక్కరికీ లేదని, ఇది రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమేనని విపక్ష నేతలు కాషాయ పాలకులపై విరుచుకుపడ్డారు.
Read More :