లక్నో, జూన్ 16 : జెడ్డా నుంచి 242 మంది హజ్ యాత్రికులతో బయల్దేరిన ఓ సౌదీ విమానం ఆదివారం లక్నోలో ల్యాండ్ అవుతుండగా, విమానం టైర్ల నుంచి పెద్ద ఎత్తున పొగలు, నిప్పురవ్వలు వెలువడ్డాయి. దీంతో విమానాశ్రయంలో అలారం మోగిందని, అయితే విమానంలోని హజ్ యాత్రికులంతా సురక్షితంగా బయటకు దిగారని ఇక్కడి చౌదరీ చరణ్‌సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు.
రెస్క్యూ, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి విమానానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకున్నారని చెప్పారు. విమానాశ్రయంలో విమాన సర్వీసులకు ఎలాంటి ఆటంకాలు ఏర్పడలేదని తెలిపారు. చిన్నపాటి సాంకేతిక లోపం మాత్రమే సౌదీ విమానంలో తలెత్తిందని, ఆ విమానం తిరిగి జెడ్డాకు వెళ్లిపోయిందని అధికార వర్గాలు తెలిపాయి. విమానంలోని హజ్ యాత్రికులంతా సురక్షితంగా ఉన్నారని, వారి ప్రయాణం ఎలాంటి ఆటంకం లేకుండా ముగిసిందని ఉత్తరప్రదేశ్ మంత్రి అన్సారీ మీడియాకు తెలిపారు.