Thiruvananthapuram | ఇండోనేషియాలోని జకార్తా నుంచి సౌదీ అరేబియాలోని మదీనాకు వెళ్తున్న సౌదీ ఎయిర్‌లైన్స్ విమానాన్ని అత్యవసరంగా తిరువనంతపురంలో ల్యాండ్ చేశారు. ఈ విషయాన్ని విమానాశ్రయం అధికారులు ధ్రువీకరించారు. విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు స్పృహ కోల్పోయాడు. దాంతో విమానాన్ని అత్యవసరంగా తిరువనంతపురం మళ్లించారు. ఇండోనేషియా జాతీయురాలు సదరు ప్రయాణికుడిని అనంతపురి ఆసుపత్రికి తరలించారని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు పేర్కొన్నారు. సౌదీ ఫ్లైట్ SV 821 విమానం 395 మంది ప్రయాణికులు, 18 మంది సిబ్బందితో వెళ్తున్న సమయంలో 37 ఏళ్ల ఇండోనేషియా జాతీయురాలు లియా ఫటోనా అకస్మాత్తుగా తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడుతూ స్పృహ కోల్పోయింది.
దాంతో స్పందించిన విమాన సిబ్బంది ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు సమాచారం అందించి.. తిరువనంతపురంలో అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరారు. విమానం అధికారులు వెంటనే గ్రౌండ్ మెడికల్ బృందాలతో సమన్వయం చేసుకుని.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో విమానం సురక్షితంగా దిగే ముందు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. ల్యాండింగ్ అయిన వెంటనే, ప్రయాణికురాలిని అత్యవసర చికిత్స కోసం అనంతపురి ఆసుపత్రికి తరలించారు. లియా ఫటోనా ఛాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరారని, ఆమెకు ఈసీజీ, ఇతర రక్త పరీక్షలన్నీ చేశారని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటుందని.. అత్యవసర విభాగంలో ఉన్నారన్నారు. ఆ తర్వాత విమానం ఇంధనాన్ని నింపుకొని రాత్రి 8.30 గంటల ప్రాంతంలో మదీనాకు బయలుదేరి వెళ్లిందని ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. బాధిత ప్రయాణీకురాలికి నిరంతర సహాయం అందించడానికి ఎయిర్‌లైన్ ఆసుపత్రి సిబ్బంది.. స్థానిక అధికారులతో సమన్వయం చేస్తున్నారని వివరించింది.