న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో లక్షల మంది వలస కార్మికుల జీవితాలను దుర్భరం చేసిన కఫాలా వ్యవస్థను రద్దు చేస్తున్నట్టు ఆ దేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో సౌదీలోని సుమారు 1.3 కోట్ల మంది వలస కార్మికులకు లబ్ధి చేకూరనుంది. కఫాలా వ్యవస్థ కింద ఓ కఫీల్ (యజమాని) తన వద్ద పనిచేసే కార్మికుల జీవితాలపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటాడు.
వలస కార్మికుడు ఉద్యోగం మారాలన్నా, దేశం విడిచి పోవాలాన్నా లేక న్యాయ సహాయం కోరాలన్నా యజమాని అనుమతి తప్పనిసరి. విదేశాల నుంచి అతి తక్కువ వేతనాలకు వచ్చే కార్మికులను నియంత్రించేందుకు 1950లో ఈ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనిని కఫీల్లు దుర్వినియోగం చేస్తూ కార్మికులను బానిసల కన్నా హీనంగా చూడటం ప్రారంభించారు.