Satyendar Jain : ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నాయకుడు, ఢిల్లీ ఆరోగ్య శాఖ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ (Satyendar Jain) కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. మానీలాండరింగ్ కేసులో అరెస్టయిన జైన్‌కు దాదాపు రెండేళ్ల తర్వాత బెయిల్ లభించింది. శుక్రవారం కేసు విచారణ జరిపిన ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సుదీర్ఘ దర్యాప్తు, ఎక్కువ కాలం విచారణ ఖైదీగా జైలులో ఉండటం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని జైన్‌కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు కోర్టు పేర్కొన్నది.
పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఓ కంపెనీ లావాదేవీలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు 2022 మే 30న సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేశారు. 2015-16 సమయంలో జైన్ కంపెనీలకు షెల్ కంపెనీల నుంచి దాదాపు రూ.4.81 కోట్లు ముట్టినట్లు ఈడీ దర్యాప్తులో తేలింది. సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ ఈ కేసు దర్యాప్తు చేపట్టింది. అనంతరం సత్యేందర్ జైన్‌తోపాటు ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన అటాచ్ చేసిన ఈడీ జైన్‌ను అరెస్ట్ చేసింది.