Satyapal Malik | కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో రూ.2,200 కోట్ల సివిల్ పనుల కేటాయింపులో అవినీతి ఆరోపణలపై జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌తో పాటు మరో ఐదుగురిపై గురువారం కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) చార్జిషీట్ దాఖలు చేసింది. మూడేళ్ల దర్యాప్తు తర్వాత సీబీఐ తన నివేదికను ప్రత్యేక కోర్టుకు సమర్పించింది. జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు సీబీఐ ఏప్రిల్ 2022లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. సత్యపాల్ మాలిక్ ఆగస్టు 2018 నుంచి అక్టోబర్ 2019 వరకు జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా కొనసాగారు. ఈ వైపు సీబీఐ చార్జిషీట్ దాఖలు చేసిన తర్వాత ఆయన ఆసుపత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను ఎవరితోనూ మాట్లాడలేని స్థితిలో ఉన్నానని ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నారు. తనకు చాలామంద్రి శ్రేయోభిలాషుల నుంచి ఫోన్‌కాల్స్ వస్తున్నాయని.. వాటికి తాను సమాధానం చెప్పలేకపోతున్నానన్నారు. మాలిక్ 2018 ఆగస్టు 23 నుంచి 2019 అక్టోబర్ 30 వరకు జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా ఉన్నారు.
Read Also : Waqf Act | వక్ఫ్ చట్టంపై పిటిషన్లు.. మధ్యంతర ఉత్తర్వులపై తీర్పును రిజర్వ్ చేసిన ‘సుప్రీం..!
కిరు జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ఫైల్స్‌ను అప్రూవ్ చేసేందుకు తనకు రూ.300కోట్ల లంచం ఆఫర్ చేశారని ఆయన వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. కానీ, గతేడాది సీబీఐ సోదాల తర్వాత తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆయన ఖండించారు. తానే ఫిర్యాదు చేస్తే.. తన ఇంట్లో సోదాలు నిర్వహించడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అవినీతికి పాల్పడిన వారిపై దర్యాప్తు చేయడానికి బదులుగా.. సీబీఐ తన నివాసంపై దాడులు చేసిందని మాలిక్ పేర్కొన్నారు. దాడుల్లో నాలుగైదు కుర్తాలు, పైజామాలు తప్ప వారికేమీ దొరకవని.. ప్రభుత్వ సంస్థలను దుర్వినియోగం చేయడం, నియంత తనను భయపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రైతు కొడుకునని.. భయపడను.. తలవంచనని స్పష్టం చేశారు. సీబీఐ అప్పటి చీనాబ్ వ్యాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (CVPPPL) చైర్మన్ నవీన్ కుమార్ చౌదరి, ఎంఎస్ బాబు, ఎంకే మిట్టల్, అరుణ్ కుమార్ మిశ్రాతో పాటు ఇతర అధికారులు, నిర్మాణ సంస్థ పటేల్ ఇంజినీరింగ్ లిమిటెడ్‌పై కేసు నమోదు చేసింది.