చండీగఢ్: బీజేపీ నాయకురాలి వద్ద డ్రగ్స్ లభించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ ఆమెపై చర్యలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే అయిన ఆమెను ఆరేళ్ల పాటు బీజేపీ నుంచి బహిష్కరించింది. బీజేపీ నాయకురాలు సత్కర్ కౌర్ (Satkar Kaur) ఆమె బంధువు జస్కీరత్ సింగ్ బుధవారం హెరాయిన్ తరలిస్తుండగా మొహాలీలోని ఖరార్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరి నుంచి 128 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
కాగా, డ్రగ్స్ కేసులో సత్కర్ కౌర్‌ను పోలీసులు అరెస్ట్ చేయడంపై బీజేపీ స్పందించింది. మాజీ ఎమ్మెల్యే అయిన ఆమెను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి తొలగించింది. పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ ఆదేశాల మేరకు సత్కర్ కౌర్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ఆ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి అనిల్ సరిన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ప్రకటన విడుదల చేశారు.
మరోవైపు 2017-2022 వరకు ఫిరోజ్‌పూర్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా సత్కర్ కౌర్ ఉన్నారు.
అయితే 2022 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆమెకు టిక్కెట్ నిరాకరించింది. ఈ నేపథ్యంలో సత్కర్ కౌర్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు.